భగవాన్ స్మృతుల్లో చలం అంతర్మథనం | క్లుప్తంగా

Thursday, May 28, 2009
I

యీ జగత్తుకీ జీవితానికీ ఓ అర్థం వుంటే, వీటి వెనక ఓ సత్యం వుంటే, పరస్పర విరుద్దమైన యీ విలువలకీ ఓ సమన్వయముంటే, దాన్ని తెలుసుకునే మార్గం లేదనీ, మానవుడి మనసుకి అంతశక్తి లేదు గనక,ఎంత తరిచి చూసినా, అది ఓ గుడ్డి వలయంలో తిరగడం తప్ప, ఇంకేమీ సాధింపలేదనీ నిశ్చయించుకున్నాను. కాని ఎప్పుడూ అన్వేషించడం మాత్రం మానుకోలేదు. ఎంత అర్థం లేకపోయినా సత్యాన్వేషణ అనేది నా జీవితానికి ఓ ప్రధాన లక్షణమై పోయింది. ఏదో నా మనసునీ ఆలోచనలనీ మించిన విశ్వాసముండేది, నాకు దొరకనిదేదో సొల్యూషన్ వుందనీ, యీ లోకమూ జీవితమూ అర్థం విహీనం కావనీ, యీ అయోమయ స్థితిలోనే సగంపైగా నా జీవితం గడిచింది. అట్లాంటి సమయంలో దీక్షితులుగారు వొచ్చి నన్ను తనతో షికారుగా రమణాశ్రమానికి తీసుకొచ్చారు 1936లో.

II


తోవలో భగవాన్ కోసం పళ్ళు కొనమంటే కొననన్నాను. ఆయనకి సాష్టాంగ పడమంటే పడనన్నాను. భగవాన్ ముందు నిశ్చబ్దంగా కూచున్న ప్రజలలో కూచోడం నాకు బాధగా వుంది. వొచ్చినప్పటినించి ఎప్పుడు పోదామా అని దీక్షితులు గారిని వేధిస్తున్నాను. ఆశ్రమంలో మనుష్యుల్ని చూసిన కోద్దీ అసహ్యం పుడుతోంది. 'యీ మహర్షి ఏదో దివ్య పురుషుడంటారు మీరు. మనుషుల్నే మారుస్తాడన్నారు. ఇన్నేళ్ళమట్టి ఆయనని అంటిపెట్టుకొని వున్న వీళ్ళ మొహాలిట్లా వున్నాయేమిటి ?'

ఆ రోజు భగవాన్ కొండమీదికి వెళ్ళి తిరిగి హాలులోకి. మా గుంపు వెనకనించి భగవాన్ వొస్తున్నారు. అందరూ పక్కకి తప్పుకొంటున్నారు. నేనే కదలలేదు, 'చోటు వుంది, పక్కకి తప్పుకుపోతారులే ఆయన ' అనుకుని. భగవాన్ సమీపించేటప్పటికి దీక్షితులుగారు నన్ను పక్కకి లాగేశారు. భగవాన్ నన్ను దాటి వెళ్ళి చప్పున ఆగి, వెనక్కి తిరిగి నన్ను ఓ గొప్ప చిరునవ్వుతో ఓ నిమిషం చూసి వెళ్ళిపోయినారు. ఆ నిమిషాన నాకేమనిపించలేదు గాని, ఇప్పుడు తలుచుకుంటే, ఆ నిమిషం నించే నన్ను జయించేసుకున్నారు భగవాన్ అనిపిస్తుంది.

III

పాత భక్తులూ, ఘరానా వాళ్ళూ భగవాన్ కి దగ్గిరగా కూచునేవారు. నేను చిట్ట చివర కూచుని ఆయన కళ్లలోకే చూస్తో వుండేవాడిని. ఒకసారి భగవాన్ తన దగ్గిర వున్నవాళ్ళని అడిగారు, అందరూ లేచిపోయినా కదలక కూచున్న నన్ను చూపి,

'ఎందుకు అన్ని గంటలూ అట్లా కూచుంటాడు ' అని.
వాళ్ళేదో అన్నారు. అది నా కర్థం కాలేదు. నాకేం కావాలి? ఆధ్యాత్మికోన్నతి. ఆ సంగతి భగవాన్ కి తెలీదా ? అనుకుని మాట్లాడకుండా వూరుకున్నాను. హాల్లోకి భగవాన్ వొస్తున్నపుడు సౌరీస్ దగ్గిర ఆగి చిరునవ్వుతో కొంతసేపు చీసి వెళ్ళేవారు. నేను బలవంతంగా హాల్లో కూచునేవాణ్ణి.
మళ్ళీ ఇంకోసారి అడిగారు దగ్గిరున్న వాళ్ళని,

'ఏం కావాలి? ఎందుకట్లా కూచుంటాడు ?' అని.
అప్పుడూ నేను మాట్లాడలేదు. 'ఏం భగవాన్ కి తెలీదా? '.

ఇప్పుడు తెలుస్తోంది భగవాన్ ప్రశ్నకి అర్థం.
'నన్ను చూస్తో కూచుంటే ఏమొస్తుంది? తనకి తాను సాధించుకోవాలి కాని '

IV

వొయ్యి చచ్చిపోయిన తొందరలోనే అరుణాచలం వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. ఆనాడు మాకు మిత్రులు లేరు , ఆదాయం లేదు, ఒక్క భగవాన్ తప్ప ఎవరూ కనిపించలేదు. భగవాన్ కి కూడా చాలా జబ్బుగా వుంది . బతకరంటున్నారు. 1950 మొదట్లో వొచ్చి, ఓ ఇల్లూ పాకా అద్దెకి తీసుకుని వున్నాం. భగవాన్ అంత జబ్బులోనూ , ఎంతో ఆదరంగా చూశారు మా వంక, మా రాకకే ఎదురుచూస్తున్నట్లు. త్వరలోనే భగవాన్ అస్తమించారు. మేం ఆయన ముందు చావాలని వొస్తే, ఆయనే మా ముందు వెళ్ళిపోయారు. భక్తులందరూ వెళ్ళిపోయారు. ఆశ్రమం , మేమూ మాత్రమే మిగిలాం. భయం పుట్టించే వొంటరితనంలోనూ భగవాన్ మమ్మల్నిఆదుకుని, అర్థంగాని ధైర్యమిచ్చి రక్షించారు. భగవాన్ వెళ్ళేముందు తాను ఇక్కడే వుంటానన్నాడు.నా ఆరోగ్యమూ సన్నగిల్లుతోంది. చివరి దశను సమీపిస్తున్నాను.

ఇప్పటికీ నాకు దేవుడిలోగాని, కర్మలోగాని, చావు తరవాత బతుకులోగాని విశ్వాసం లేదు. ఏదన్నా చేస్తే భగవాన్ ఒక్కరే చెయ్యగలరని విశ్వాసం మాత్రం వుంది.


[కుదిరితే యింకెప్పుడైనా వివరంగా ' రమణాశ్రమంలో భగవాన్ తో చలం ' ]

0 comments: