వంకాయ తొడిమల్ని కూర చెయ్యమన్నారు. తొడిమల కూర? ఎవరు తింటారు?

Wednesday, July 1, 2009
సంపూర్ణమ్మ జ్ఞాపకాల్లో ...

ఒకసారి జయంతికి ఎన్నో వంకాయలు వొచ్చాయి. వరసగా కొన్ని పూటలు వొండాము. వాటినుంచి కోసిన తొడిమలన్నీ ఓ కుప్ప పడి వున్నాయి, ఏది పారెయ్యడానికి ఎవరికి సాహసం లేదు. వాటిని చూసి భగవాన్, ఆ తొడిమల్ని కూర చెయ్యమన్నారు. తొడిమల కూర! ఎవరు తింటారు?

చేశాం.
వాటిల్లో ఎండు బటానీలు కలిపి , ఎన్ని గంటలు వుడికించినా వుడకవు - తొడిమలుగాని, గింజలుగాని. ఎందుకు వొచ్చారో హాలులోంచి వంటింటిలోకి వొచ్చారు భగవాన్. ఎంత పనిలో వున్నా సరే, మా వంటలో ఏదన్నా సమస్య వొచ్చిందా, ఎట్లా వొచ్చేవారో - మా ఎదుట వుండేవారు. హాలు గుమ్మం దగ్గిర మేము కనపడ్డామా, వెంటనే లేచి వొచ్చేవారు మా వెంట. వంటచేసేవారి పైన వున్న అనుగ్రహం, ఎవరిపైనా వున్నట్టు కనపడేదికాదు, ఆ హాలులో కూచున్న వారిపైన.

'ఎట్లా వుంది కూర ?' అన్నారు.
'కూర ఏమిటి? అవి తొడిమలు కావు. ఇనపగుగ్గిళ్ళు, ఎన్ని గంటలకీ వుడకవు!' అన్నాను.'

ఏం? వుడకలేదా?' అంటూ ఓసారి గరిటతో తీసి చూసి, కలిపి, ఏ ఉపాయం చెప్పకుండానే వెళ్ళీపోయినారు.

వెళ్ళి చూస్తే -
తొడిమలు, ఎండు బటానీలు అన్నీ వుడికి వున్నాయి.
ఆ రాత్రి అందరూ చాలా బాగా తిన్నారు. ఆ కూర ఏమి కూర అని అడిగారు తినేవారు. ఎవరూ చెప్పుకోలేకపోయినారు. వొక్కసారే వొడ్డించాను అంత కష్టపడి చేసిన కూరని, భగవాన్ కి అంతా. అంతా ఒక్క ముద్దగా నోట్లో వేసుకుని మింగేశారు. నా ప్రాణం చివుక్కుమంది. అంత రుచైన కూరని, అంత కష్టపడి చేసిందాన్ని అట్లానా తినడం? తరువాత ఎన్నిసార్లు కూర వొడ్డిస్తానన్నా, వొద్దన్నారు.

మర్నాడు అన్నారు ఎవరితోనో, 'రాత్రి నేను కూర తినలేదని సంపూర్ణమ్మ మనసు నొచ్చుకుంది. నేను తింటేనేం, తినకపోతేనేం? తను శ్రద్దగా చేసింది నేను తిన్నట్టే ' అని. భక్తులకన్న స్వామికి ఎక్కువ వెయ్యాలని నా మనసులో ఏ మూలన్నా వుందో ఏమో ఆ వ్యత్యాసాన్ని తీసేసే సాధనం తాను తినకపోవటమే!

వంట బాగా వొచ్చినా, చెడిపోయినా, దాంట్లోంచి మాకో వేదాంతం. ఆ వాక్యాలే, ఎటు పడితే అటు అర్థం తీసుకునేవిగా వుండేవి. ఓసారి సేమియా పుట్టు చేస్తో వున్నాము - జాగర్తగా పొడి పొడిగా వొచ్చేట్టు.

భగవాన్ వొచ్చి అంతా అణిచేశారు. 'ఇదేమిటి భగవాన్, ఇట్ల అణిచివేశారు? అంతా ముద్దయి పోయిందే? ' '
అవును, విడివిడిగా వుంటే ఏం బావుంటుంది ? అంతా ఏకంకావాలి.'

చాలా రుచిగా వుంది సేమియా పుట్టు ఆ రోజున.

4 comments:

విహారి(KBL) said...

Great blog

సురేష్ బాబు said...

Bhagavan is really The Bhagavan. No doubt about it. The person like you, who let us remember bhagavan, is appreciated.

మనోహర్ చెనికల said...

I too go with suresh babu.

Satyaanveshi sathyam said...

బాబూ! మీరెవరో కానీ మీరు ఎంతో కష్టపడి ఎంతో సమచారాన్ని తెలుగు భాషలోకి మార్చి రాసి ఎందరో రమణ భక్తులకు వెలకట్టలేని సాయం చేసారు. నాకు ఆ రమణ భగవానుని గూర్చి ఎంత చదివినా ఇంకా తనివి తీరదు. చదువుతున్నంతసేపూ ఆ భగవానులే నా ప్రక్కన ఉన్నట్లు, ఆ సంఘటనలన్నీ నా ముందే జరుగుతున్నట్లు అనిపించి ఎంతో ఆనందం కలుగుతుంది. ఏ ఫలాపేక్షాలేకుండా మీరు చేస్తున్న ఈ రమణ సేవకి తప్పక ఆ భగవానుని ఆశిస్సులు మీకు లభిస్తాయి....తథాస్తు......!!

Blog Archive