భగవాన్! మీరీ ఔషధం సేవించండి !

Thursday, January 21, 2010
 కసారి 1945 నవంబరులో రామచంద్రరావు గారని ఆయుర్వేద వైద్యులు భగవాన్ శరీరానికి బలమిచ్చే ఔషధం చేయటానికని దినుసులన్నీ జాబితా రాసుకొని భగవాన్ కు  చూపారు. చెప్పగానే వినే బుద్దిమంతుడైన పిల్లవాడిలాగ అవన్నీ చదివి వాటివాటి గుణాలు పొగడి 'ఎవరికయ్యా ఈ మందు?' అన్నారు భగవాన్. 'భగవానులకే ' అన్నారాయన. 'సరి సరి ,పెద్ద జాబితాయే పట్టుకొచ్చావు గానీ, డబ్బులకెక్కడికి పోయేది ? పది రూపాయలవుతుంది. యెవరిని యాచించాలి?' 'అయ్యో! ఇదంతా యెవరిది స్వామీ?' అన్నారెవరో. 'సరేలే! నాకేముంది. అంతా ఆ సర్వాధికారిని (ఆశ్రమాధికారి) అడగాల్సిందే. ఎవరడుగుతారిప్పుడు. గంట కొట్టగానే పోతే పట్టేడన్నం పెడతారు. అందరితో పాటు తినివస్తాను. ఆలస్యమైతే పెట్టం పొమ్మంటారేమో అన్న భయంతో. ఆ వడ్డనలోనూ లాస్టులో ఫస్టే కదా '  అన్నారు భగవాన్. పాపమా వైద్యులు కంపిత హస్తాలు జోడించి 'వూరికే జాబితా చూపించానేగాని దినుసులు నేను తెస్తాను స్వామీ ' అంటే, 'సరే! ఇది నాకు మంచిదైతే వీరందరికీ మంచిది కాదా? నాతో పాటు అందరికీ ఇవ్వగలరా? పనిచేసేవాళ్లకు బలమిచ్చే మందు వద్దు గాని తిని కూర్చుండే నాకు మాత్రం కావాలీ? చాలు చాలు పొండి ' అన్నారుభగవాన్.

డాక్టరు శ్రీనివాసరావుగారొకప్పుడు ఇంగ్లీషు మందేదో బలమిచ్చేది వున్నది, భగవాన్ అది పుచ్చుకుంటే మంచిదన్నారు. మంచిదే. 'మీరు ధనవంతులు. ఏదైనా ఏదైనా తినవచ్చును. నేనో, బిచ్చగాడిని. అంత ఖరీదు గల మందులు నాకెట్లావస్తాయి?' అన్నారు భగవాన్. 'భగవాన్ అన్నీ వద్దంతాౠ గాని తినేటట్టయితే రావా, పోనీ మందులు కాకుంటే మానెయ్యండి, ఆహారమైనా బలకరమైనది తినగూడదా? అరవిందులు చూడండి, పాలూ, పళ్లూ, బాదం, మొదలైనవి తిని బలిష్ఠులై వుంటారు. వారి భోజనమే ప్రత్యేకం ' అన్నారు డాక్టరు. 'సరి సరి, ఇవన్నీ తినేందుకు నాకేముందీ? దరిద్ర నారాయణుణ్ణి, పైగా, నేనేం వంటరిగాణ్ణా యేమి? గంపంత సంసారం! అందరికీ పళ్ళూ, పాలూ, బాదం ఎట్లావస్తాయి?' అన్నారు భగవాన్.

0 comments: