'నీకేమి తెలియదనేది ఎట్లా తెలిసింది?'

Friday, January 29, 2010
ఒకానొక ఉదయం ఆశ్రమానికి ఒక యువకుడొచ్చాడు. వచ్చిన రెండు మూడు రోజులు సత్రం భోజనంతో, మఠంలో సుఖ నిద్రతో తింటో పడుకుంటో భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. వెళ్ళిపోయేముందు ఒకరోజు భగవాన్ ని సమీపించి జంకుతూ

'స్వామీ! ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మిమ్మల్నేదో అడగటం మీరేదో సెలవిస్తూ వుండటం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే నాకూ యేదో ఆశ కలుగుతోంది. కాని ఏం అడగాలో తెలియకుండా వుంది. ఇక తరించే దెట్లాగా?' అన్నాడు దీనంగా.

భగవాన్ సాదరంగా చూచి 'నీకేమి తెలియదనేది ఎట్లా తెలిసింది?' అన్నారు నవ్వుతూ.

'ఇక్కడికి వచ్చిన వారంతా అడిగే ప్రశ్నలూ మీరు సెలవిచ్చే ప్రత్యుత్తరాలూ వింటూ వుంటే అయ్యో మనకు ఏమీ తెలియదే అనిపిస్తోందీ అన్నాడతను.

దానికి భగవాన్ 'ఆ! ఇంకేం ! ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నావు. అదే చాలు. ఇంకేం కావాలి?' అన్నారు భగవాన్.

'అంత మాత్రానా తరించేదెట్లాగా స్వామీ?' అన్నాడా పృచ్ఛకుడు.

'ఎట్లాగేమి? ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా. ఆ తెలుసుకునే వాడేవడని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలీదే ఎట్లాగా తరించటం, అన్న తెలివి కలగటం ఎంతో మేలు కదా!' అన్నారు భగవాన్ '.

అంతటితో ఆ యువకుడు యెంతో సంతోషించి బయలుదేరి వెళ్ళిపోయాడు.

0 comments: