ఎప్పుడో యిస్తానంటే కాదు స్వామీ. ఇప్పుడే మోక్షమివ్వండి !!

Monday, February 1, 2010
కానొక రోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ ఒక స్త్రీ కొత్తగా వచ్చి హాలులో కొంతసేపు కూర్చుంది. ఆ కూర్చున్నంత సేపూ భగవాన్ ని యేదో అడగాలని ఆరాటంగా కనిపించింది. భగవాన్ యేదో చదువుకుంటూ వుండటం వల్ల తనూ అడగలేకపోయింది చాలాసేపు. భగవాన్ తను చదువుతూ వున్న పుస్తకాన్ని పక్కన పెట్టగానే ఆమె లేచి సోఫా దగ్గరకు వెళ్ళి 
'స్వామీ! నాకు ఒక్క కోరిక వున్నది. చెప్పమంటారా?'  అంది. 
'సరే! ఏం కావాలి?' అన్నారు భగవాన్.
'మోక్షం ' అన్నదామె. 
భగవాన్ 'ఓహో! అట్లాగా!' అన్నారు. 
'అవును స్వామీ!' మోక్షం ఒక్కటి ప్రసాదిస్తే  చాలు' .
సరేనన్నారు భగవాన్. 
'ఎప్పుడో యిస్తానంటే కాదు స్వామీ. ఇప్పుడే ఇవ్వాలి ' అన్నదామె. మళ్ళీ సరేనన్నారు భగవాన్. ఆమె వెళ్లిపోయింది సెలవు తీసుకుని. ఆమె అలా వెళ్ళగానే అక్కడే హాలులో వున్న సుబ్బాక్ష్మమ్మ అనే ఒకావిడ అందుకొని 

'మేమూ అందుకే వచ్చి వున్నాం. ఇంకేమీ వద్దు, మోక్షమిస్తే చాలు స్వామీ ' అంది. 'అట్లాగా. ఏమీ వద్దని అన్నీ విడిచిపెడితే వుండేది మోక్షమే. ఒకరిచ్చేదేమి? ' అన్నారు భగవాన్. 'అదంతా మాకు తెలియదు. భగవానే మాకు మోక్షమివ్వాలి.! ' అంటూ ఆమె వెళ్ళిపోయింది.  

'అదేమి మూటా ముల్లా?  కట్టి ఇచ్చేందుకు? ఇంక యేమీ కోరరట? ఒక్క మోక్షమిస్తే చాలట. అది మాత్రం కోరిక కాదు గాబోలును. ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది మోక్షమే. అవి పోగొట్టుకునేందుకు సాధన చేయాలి ' అన్నారు భగవాన్.