రమణాశ్రమానికి పక్కన విభూతి స్వామి ఆశ్రమం

Thursday, September 22, 2011
భగవాన్ కి కాళ్లనొప్పులు తగ్గటానికి విటమిన్లు గల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహావల్ల ఆహారపదార్థాలలో ఏమేమో మార్పులు చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్దీ, కాళ్లు ఒత్తీ తోచిన ఉపచారాలు చేస్తూ వుంటే భగవాన్ ఛలోక్తిగా 'ఇంటికి చుట్టం వస్తాడు. చూచి చూడనట్లుంటే త్వరగా వెడతాడు గాని మర్యాద చేస్తే వెళ్లనే వెళ్లడు. వ్యాధిన్నీ అంతే. మీరట్లా ఉపచరిస్తే అదెందుకు పోతుందీ? లక్ష్యపెట్టకుంటే, తానే పోతుంది ' అంటూ పరిహాసమాడుతూ వుంటారు. 

ఆ మధ్య విభూతి ఇచ్చి రోగాలు పోగొడతానని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్లే రోడ్డున ఒక మైలు దూరంలో మకాం వేశాడు. జనానికి వేలం వెఱ్ఱిగాదూ. ఆ విభూతి స్వామిని చూడాలని నేల యీనినట్లు వ్యాధిగ్రస్తులూ, దయ్యాలు పట్టినవారూ, భూతాలు పట్టినవారూ, అక్కడికి పోతూ వస్తూ ఆశ్రమానికిన్నీ వచ్చేవారు. ఇక్కడేం, విభూతులా? రక్షరేకులా? దర్శనం చేసుకొని హాలు చుట్టూ తిరిగి పోయేవాళ్లు. 

ఆ సమయంలో సేవకులెవరన్నా కాళ్లకు తైలం రుద్దటానికి ఆరంభిస్తే భగవాన్ మందహాసం చేస్తూ 'భేష్! ఇదీ ఒకందుకు మేలే! ఈ జనమంతా నన్ను చూచి 'ఈ స్వామి తానే కాళ్లనొప్పులతో బాధపడుతూ, ఇతరులచేత పట్టించుకుంటున్నాడు, మనకేం చేస్తాడురా ' అని దగ్గరకు రాకుండానే పోతారు. మంచి ఉపాయం ' అనేవారు.

2 comments:

రాజి said...

శ్రీధర్ గారు భగవాన్ రమణ మహర్షి గారి గురించి
వ్రాసిన మీ బ్లాగ్ చాలా బాగుంది..
మేము ఈ మధ్యనే తిరువన్నామలై వెళ్ళి వచ్చాము..
అక్కడ అతిధి ఆశ్రమం కూడా చూశాము..
చాలా ప్రశాంతంగా,ఒక దివ్యమైన అనుభూతిని కలిగించేలా వుంది ఆశ్రమం..

Sandeep said...

ఆయన ముఖంలోని ప్రశాంతత చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. ఒక శతాబ్దానికి ఒకళ్ళో ఇద్దరో పుడతారు అలాంటి మహానుభావులు. ఆయన video దొరకడమే మనం ఎన్నో జన్మలనుండి చేసుకున్న పుణ్యం. సాక్షాత్బ్రహ్మ స్వరూపం మహర్షి!