భగవాన్! నేను సంసారాన్ని వొదిలేద్దామనుకుంటున్నాను!

Monday, January 25, 2010
ఒకసారి మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్రులొకరు, నడివయస్సు వారు, భగవాన్ ని సమీపించి 'స్వామీ! నేను రామనామం నియమంగా ఉదయం ఒక గంటా, సాయంత్రం ఒక గంటా జపిస్తూ వుంటే, కొంచెం సేపటికే తలపులు ఒకటొకటిగా బయలుదేరి, అంత కంతకు అధికమై, ఎప్పటికో మనం చేసే జపం మరచి పోయామే అని తోస్తుంది. ఏం చేసేది? ఈ అంతరాలు రావడానికి కారణం సంసారం గదా.
అందువల్ల సంసారం వదలివేద్దామా, అని యోచిస్తున్నానన్నాడు.

 'ఓహో! అట్లాగా! అసలు సంసారమంటే యేమి? అది లోపల వున్నదా? బయట వున్నదా?' అన్నారు భగవాన్.

'భార్య పిల్లలూనూ ఇత్యాదులండీ ' అన్నాడాయన.

 'అదేనా సంసారం? వారేం చేశారు? అసలు సంసారమంటే ఏదో తెలుసుకోండి ముందు. ఆ వెనక విడవటం యోచిద్దాం'. అన్నారు భగవాన్. ఆయన నిరుత్తరుడై తలవంచి వూరుకున్నాడు.

భగవాన్ కరుణాదృష్టితో చూస్తూ 'భార్యా పిల్లలను  వదలి వచ్చి  ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారమవుతుంది. సన్యసిస్తే కఱ్ఱ, కమండలం  ఇత్యాదులతో అదొకరకపు సంసారంగా పరిణమిస్తుంది. ఎందుకదీ? సంసారమంటే మనస్సంసారమే. ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడ వున్నా ఒకటే, ఏదీ బాధించదు ' అన్నారు భగవాన్.

0 comments: