భగవాన్! కలియుగం ఎప్పుడు అంతం అవుతుంది? యుగాల గురించి చెప్పండి!

Sunday, July 26, 2009
ఎంతో కాలం నుంచీ అరవిందాశ్రమంలో ఉంటున్న గిరిధారీలాల్ ఒకరోజు సాయంత్రం వచ్చి ఆశ్రమంలోనే ఉన్నారు. ఆయన మర్నాటి ఉదయం భగవాన్ ను

'కలియుగం కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందనీ, ఇన్ని సంవత్సరాలు గడిచాయి. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి అనీ పురాణాలలో చెప్పబడి ఉందే. ఈ యుగం ఎప్పుడు అంతమౌతుందో తెలుపుతారా ?' అని అడిగారు.

భగవాన్ 'నేను కాలం నిజం అని అనుకోను. కాబట్టి ఈ రకమైన విషయాలను నేను పట్టించుకోను. గడచిన యుగాలను గురించిగానీ, గడపబోయే వాటిని గురించిగానీ మనకేమి తెలీదు. వర్తమానం ఉందని మాత్రం తెలుసు. మొదట దానిని గురించి తెలుసుకుందాం. అప్పుడు ఇంకే సందేహాలూ మిగులవు ' అన్నారు.

కొంతసేపు ఆగి తిరిగీ భగవాన్ 'కాలదేశాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. కానీ, నిత్యమైనదీ, మారనిదీ ఒకటుంది. ఉదా. ప్రపంచమూ, కాలమూ - అది గతముగానీ, భవిష్యత్తుగానీ - ఏవీ మన నిద్రలో ఉండవు. కానీ మనం ఉంటాం. కాబట్టి ఎప్పుడూ మారనిది, ఎప్పుడూ ఉండేది ఏదో దాన్ని కనుక్కోవాలని ప్రయత్నిస్తాం. కలియుగం ఫలాన అప్పుడు పుట్టిందనీ, ఇంకా ఇన్నేళ్ళ తరువాత ఫలాన సంవత్సరం అంతమవుతుందనీ తెలుసుకోవడం వల్ల మనకేం ప్రయోజనం ?'

గిరిధారి లాల్: 'కాల దేశాల కతీతులుగా ఉన్నవారి దృష్టిలో ఈ ప్రశ్నల కర్థంలేదని నాకు తెలుసు. కానీ సమస్యలలో కొట్టుకుంటూ ఉన్న మాలాంటివారికి ఇవి ముఖ్యమే. ముందు యుగాల్లో - సత్యయుగంలో మనిషి ఈ కలియుగంలోలాగా ఇంత దుస్థితికి దిగజారలేదని, ఆ కాలాల్లో ముక్తిని సాధించడం ఇప్పటికన్నా ఎంతో తేలికనీ అన్నారు కదా?'

భగవాన్ : 'దానికి విరుధ్ధంగా సత్యయుగంలో కంటే ఈ కలియుగంలోనే ముక్తి చాలా సులభంగా సాధించవచ్చని కూడా చెప్పి ఉన్నారే! ఆ యుగాల్లో ఎన్నో ఏండ్ల తపస్సుచేత మాత్రమే ఫలించేది. ఈ యుగంలో కొద్దిరోజులు లేదా కొన్ని గంటలు తపస్సుతోనే ఫలించగలదని గ్రంధాలలో చెప్పి ఉందే. ఇంతకూ సాధించేదీ లేదు. ఇంతకాలంలో అన్నమాటా లేదు. నీవు ఎప్పుడూ ఉన్నట్లే ఉన్నావు. నీవు దేనినీ సాధించాల్చిన పనీ లేదు. నీవు పరిమితుడననీ ఉపాధిని ఆశ్రయించి ఉన్నావనీ అనుకోవడాన్ని మానేయడం మాత్రమేనీవు చేయవలసింది.'

గిరిధార్ లాల్ : 'అయితే ఈ పురాణాలు యుగాల కాలపరిమితిని గురించి ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాయంటారు ?' భగవాన్ : ' ప్రతి యుగానికీ నిర్ణయించిన సంవత్సర సంఖ్యలో ఏదో విశేషార్థం ఇమిడి ఉంటుంది. అలా కాకుంటే ప్రతి యుగానికి అంత కాల పరిమితి నిర్ణయించడంలో ఉద్దేశం - మనుష్యుడు నిండు నూరేళ్ళూ బ్రతికి ఉన్నా విశ్వం యొక్క పూర్ణాయుర్థాయంలో అతని వయస్సు అత్యంత అల్పమనీ, అనంత సృష్టి క్రమంలో అతని పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదని గుర్తించి, గర్వంతో తన గొప్పలు చాటుకోకుండా వినయంగా ఉండాలని తెల్పడానికేమో? నిత్యమైన వస్తువుతో పోలిస్తే మనుష్యుని జీవిత ప్రమాణమెంత ? అని అనే బదులు నీ జీవితం ఎంత పరిమితమో ఆలోచించు అని వాళ్ళూ నేర్పారు. అంతే కాకుండా ఆ యుగాలకు ఒక క్రమబద్దమైన అనుక్రమము ఉందని కూడా సూచింపబడింది. అలాంటి మహాయుగాలు ఎన్నెన్ని వచ్చి పోయాయో ఎవరికి తెలుసు? ప్రతి మహా యుగాన్ని నాలుగు యుగాలుగా విభజించారు. ఈ లెక్కలకు అంతు అంటూ లేదు. వివిధ వర్గాల వారికి ఇప్పటి ఈ కలియుగ అంతం గురించి వేర్వేరు సిద్ధాంతాలున్నాయి.

నిద్రలో లాగా కాలమే లేనపుడు ఈ సమస్యలతో ఇంతగా తికమక పడడంలో ప్రయోజనమేమి?

కోరికల్ని ఎలా జయించాలి? తృప్తిపరిచా ? లేక అణచివేశా ?

Saturday, July 18, 2009
ఒకసారి కొన్ని ప్రశ్నలు రాసి వున్న కాగితాన్ని ఒకతను భగవాన్ కు అందించారు.

ప్రశ్న: ఎవరయినా చెప్పినదాన్ని వెంటనే నమ్మే అలవాటును ఎలా వదుల్చుకోవాలి? ఒకరు ఒక ఆదర్శాన్ని చెపితే తక్షణమే నమ్మేసి ఆచరిస్తూ, ఇంకెవరన్నా వచ్చి వేరే ఆదర్శాలను గురించి పొగిడితే వాటిని నమ్మి పాతవి వదిలి వేయడానికి తయారవుతానే!

భగవాన్ : అవునవును. మనకున్న బాధే ఇది. సత్యాన్ని తప్ప మిగతా అన్నిటినీ నమ్మేస్తాం. మనకున్న తప్పు నమ్మకాలను వదిలివేయాలి. ఇది మాత్రమే మనం చేయాల్సింది. అపుడు సత్యం స్వయంగా ప్రకాశిస్తుంది.

ప్రశ్న: ఎంతో ఉత్సాహంగా ఏదో ఒక ఆదర్శం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను. కానీ రాను రాను ఆ ఉత్సాహం కాస్తా తగ్గి పట్టుదల సడలిపోతుంది. అలా జరగడానికి కారణమేమి? అలా కాకుండా ఉండడానికి నేనేమి చేయాలి?

భగవాన్: ఆరంభంలో నీ ఉత్సాహానికి కారణం ఒకటి ఉన్నపుడు తరువాత నీ నిరుత్సాహానికి కూడా ఒక కారణం ఉండాలి కదా!

ప్రశ్న: ఎందరో గురువులు ఎన్నెన్నో మార్గాలు ఉపదేశిస్తారు. అందులో ఎవర్ని గురువుగా ఎన్నుకోవాలి?

భగవాన్: శాంతి ఎవ్వరి దగ్గర లభిస్తుందో అతనినే.

ప్రశ్న: కోరికలను వదల్చుకోవడానికి వాటితో ఏ విధంగా వ్యవహరించాలి? వాటిని తృప్తిపరిచా? లేక అణచివేశా?

భగవాన్ : తృప్తి పరచితే కోరిక నశించేటట్లయితే తృప్తిపడటంలో నష్టంలేదు. కానీ సామాన్యంగా కోరికలేవీ ఆ రకంగా నశించిపోవు. అలా చేయడం మంటలను ఆర్పడానికి పెట్రోలును మంటలమీద పోయడంలాంటిది. బలవంతంగా కోరికలను అణచడం సరియైన మార్గం కాదు. అణచిన కోరికలు అపుడు కాకపోయినా ఇంకొక్కప్పుడైనా విజృంభించి చెడు ఫలితాలకు కారణమవుతాయి.

కోరికలను వదల్చుకోవడనికి సరియైన మార్గం -
ఈ కోరిక లెవరికి? మూలమేమి ? అని తెలుసుకోవడమే.


అలా తెలుసుకున్న తరువాత ఆ కోరిక సమూలంగా నశించిపోతుంది. ఆ తరువాత అని మళ్ళీ తలెత్తడం, పెరగడం ఉండదు. కాలకృత్యాలు తీర్చుకోవడం, తినడం, తాగడం లాంటి చిన్న అవసరాలు తీర్చడంలో ఇబ్బందిలేదు. అవి నీ మనసులో వాసనలను నాటి ఇంకో జన్మకు కారణం కాదు. ఆ పనులన్నీ జీవితాన్ని గడపడానికి అవసరమౌతాయేగానీ వాసనలుగా మారే అవకాశం లేదు. తృప్తి పరచడం ద్వారా ఇంకా ఇంకా కోరికలు పెరిగి మనసులో కొత్త వాసనలను కల్పించనట్టి కోరికలను తృప్తిపరచడంలో నష్టంలేదు అని సామాన్యమైన సూత్రం.

'ఆ గిన్నెను ముట్టుకున్నావెలాగ ? మాలవాడు తెచ్చి పెట్టాడిప్పుడే ' అన్నారు భగవాన్.

Wednesday, July 15, 2009
భగవాన్ జాతి కుల మత భేదాలు ఆటించరు. అళగమ్మ పూర్వాచార పరాయణురాలు. తల్లి మూడనమ్మకాలూ, అర్థంలేని ఆచారాలూ మానిపించడానికి ఎంతో పాటుపడ్డారు.

'నీ మడిబట్టనెవరో తాకారం' టారు భగవాన్. అళగమ్మ మళ్ళీ బట్ట తడిపి ఆరేసుకుని స్నానం చేస్తుంది. 'ఆ గిన్నెను ముట్టుకున్నావెలాగ ? మాలవాడు తెచ్చి అక్కడ పెట్టాడిప్పుడే ' అంటారు భగవాన్. అళగమ్మ మళ్ళీ స్నానం చేస్తుంది. పాపం, వయసు మళ్ళిన తల్లి, రోజుకెన్నిమాట్లని స్నానం చెయ్యగలదూ !

ఎవరో చెప్పారు భగవాన్ నిత్యశుచి, వారిని తాకితే చాలు, వేరే స్నానం చెయ్యక్కర్లేదని. అప్పటినుంచీ అలా చెయ్యడం ప్రారంభించింది. అళగమ్మకు ఉల్లిపాయలూ, మునగ కాయలూ, వగైరా నిషిద్దం. ఈ పిచ్చి ఊహలని పోగొట్టాలని భగవాన్ ప్రయత్నం.

'అమ్మా, యీ వేళ ఆశ్రమంలో ఉల్లిపాయలూ, మునగకాయలూ తప్ప మరింకేవీ లేవు. తిన్నావో, నువ్వు స్వర్గానికెళ్లేటపుడు ఉల్లిపాయ పర్వతాలూ, మునగమహారణ్యాలు అడ్డొస్తాయి, ఎలాగమ్మా ' ? అంటారు. ఎన్ని విధాలో ప్రయత్నించారు భగవాన్ - తల్లి మూడనమ్మకాలు పోగొట్టడానికి, చివరికి పోయాయి కూడానూ. అళగమ్మ పూర్తిగా మారిపోయింది. భగవాన్ ఆమెను దిద్దవలసినరీతిగా తీర్చిదిద్దారు. భగవాన్ తల్లిననే తన ప్రత్యేకతను విస్మరించింది. ఇప్పుడామె భగవాన్ భక్తులలో భక్తాగ్రగణ్య. భగవాన్ కి సంపూర్ణ శరణాగతి చెందింది. కర్తవ్య నిర్వహణనాచరిస్తూ వుంటోంది.

భగవాన్ అతనితో - ' శివ శివ అనుకో - పో ' అన్నారు.

Saturday, July 11, 2009
ఆశ్రమం ఏర్పడ్డ మొదటి రోజులలో హరిజనుడు ఒకడు ఆశ్రమం బయట గుమ్మం దగ్గర నుంచుని ఉండేవాడు, తనని లోపలకు రానీయరు కనుక. భగవాన్ బయటికి వెళ్ళినప్పుడల్లా వారి వెంట అతను వెళ్ళేవాడు. తిరిగి భగవాన్ ఆశ్రమంలోకి వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర నిలిచిపోయేవాడు ఆ భక్తుడు.

కొన్నాళ్ళు అలా జరిగింది.
ఒక సాయంత్రం భగవాన్ బయటికి వెళ్ళివచ్చి, బావి దగ్గర నించున్న ఆ హరిజనుణ్ణి తన వద్దకు రమ్మని పిలిచారు. అతను సాష్టాంగపడి నించున్నాడు.

భగవాన్ అతనితో -
'శివ శివ అనుకో - పో ' అన్నారు.

అతను వెళ్ళిపోయినాడు అంతే. తిరిగి యెవ్వరికీ కనబడలేదు.

యీ కాఫీ భగవాన్ ప్రసాదం, తాగి తీరాల్సిందే . . .

Friday, July 10, 2009
ఒకసారి ఓ భక్తుడు ఆశ్రమానికి వచ్చాడు. అతనికి కాఫీ, టీ మొదలైనవి అలవాటు లేవు. ఆశ్రమంవారు అతనికి కాఫీ ఇచ్చి తాగమన్నారు. అతను తనకు అలవాటు లేదంటే,
'భగవాన్ ప్రసాదం, తాగి తీరా' లన్నారు .అతను వెళ్ళి భగవాన్ ని అడిగాడు
'స్వామీ, కాఫీ మీ ప్రసాదమట. నాకు అలవాటు లేకపోయినా, అయిష్టమయినా తాగితీరాలా?
తమరు అది తమ ప్రసాదమంటే, తాగుతాను ' అని.

భగవాన్ ఆశ్రమాధికారులతో ఇట్లా అన్నారు.
'నే నెన్నడన్నా మిమ్మల్ని అడిగానా, నాకు కాఫీ యిమ్మని? నేను తాగకపోయినా మీరు ఎట్లాగూ తాగేదానికి, కొంత స్వామికి పోసేది, అది స్వామి ప్రసాదమని వొంక పెట్టుకు తాగేది. పైగా ఎవరన్నా తాగను, వద్దంటే అదో నింద, స్వామి ప్రసాదం నిరాకరిస్తున్నారని. ఈ ఆశ్రమం వారికి ఏదేది యిష్టమో దానికంతా స్వామి ప్రసాదమని పేరు. '

ఒక వ్యక్తి చిన్నతనంలోనే మరణించడం, మరొకరు చిరకాలం. . .

Tuesday, July 7, 2009
భగవాన్ ని ఒకరు అడిగారు - 'ఒక వ్యక్తి చిన్నతనంలోనే మరణించడం, మరొకరు చిరకాలం జీవించడం జరుగుతూనే వుంది కదా, వీరిద్దరిలో ఎవరెక్కువ పాపం చేసిన వారు ? '
భగవాన్ మౌనంగా వున్నారు.
మళ్ళీ అతనే 'ఒకరు ఎక్కువ కాలం జీవిస్తే మోక్షాన్ని చేరడం కొరకు
ప్రయత్నించడానికి ఎక్కువ అవకాశముంటుంది గదా?' అని ప్రశ్నించాడు.

దానికి భగవాన్ 'ఎక్కువ కాలం బ్రతికి ప్రయత్నించే వ్యక్తికన్నా
చిన్నతనంలో మరణించి పునర్జన్మలో మోక్షానికి అనుకూలమైన అవకాశాలు ఎక్కువగా వుంటాయి '

'కర్మలను త్యాగం చేయవలెనని చెప్పడానికి అర్థం వీలయినంతవరకు కర్మలను తగ్గించుకోవాలనేనా?'

'కర్మలను వదలమనడంలోని అర్థం కర్తవు నీవనుకోకుండా కర్మలమీదా, కర్మఫలం మీదా మోహాన్ని వదలమని, నీ కర్మలను అనుభవించడం కోసంగా యీ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదలివేయడమన్నది వ్యక్తియొక్క ఇష్టాయిష్టాలమీద ఏ మాత్రం ఆధారపడదు'.

మీ భగవాన్ గొప్పవారైనా, మీలాగే తిని నిద్రిస్తూ . . . జబ్బు పడుతో . . .

Monday, July 6, 2009
ఒకప్పుడు మరుళశంకరర్ అనే పేరుగలాయన ఒక మఠం వద్ద ఎంగిలాకులు పారవేసేచోట పిచ్చివానిలా నివసిస్తూ ఉండేవాడు . ఆ మఠాధిపతికి గాని, వారి శిష్యులకుగాని యీ వ్యక్తిని గురించి ఏమీ తెలియదు. ఒకసారి అల్లమప్రభువు ఆ దారిన వెళ్ళగా మరుళశంకరర్ లేచి వారి పాదాలకు నమస్కారము చేయగా అల్లమప్రభువు వారిని కౌగిలించుకొన్నారు. వారిరువురికి ఎదుటివాళ్ళ విలువ బాగా తెలుసు. జ్ఞాని మాత్రమే యింకొక జ్ఞానికి గుర్తించగలరేమో. క్రియా చర్యా, యోగములలాంటివి అభ్యసించే వాళ్ళను వాళ్ళ నడవడివల్లనే గుర్తిస్తారేమో.

రమణాశ్రమానికొచ్చేవాళ్ళల్లో ఎంతోమంది భగవాన్ గురించి

'మీ భగవాన్ ఎంతో గొప్పవారు,
ఆత్మజ్ఞాని అని మీరందరూ ఎలా అనుకుంటారు?
ఆయన కూడా మీలాగే తిని నిద్రిస్తూ
మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నారు కదా?
అప్పుడప్పుడు ఆయనకి జబ్బు కూడా చేస్తుంది కూడానూ' అని అంటూంటారు

అంతా మాయ కదా! అన్నమూ మాయె, మీరు తినడమూ మాయె.

Sunday, July 5, 2009
భక్తులు అనేకమంది తీసుకొని వచ్చి యిచ్చేవారు, పంపేవారు పోస్టులో మందులు భగవాన్ కి - కాళ్ల నెప్పులకు రాసుకోటానికి, వంటికి బలానికీ, ఇట్లా ఎన్నో బుడ్లు చేరాయి భగవాన్ దగ్గిర అన్ని రకాల వైద్యాలవి. ఒకసారి భగవాన్ ఒక పెద్ద ఖాళీ బుడ్డి తెమ్మన్నారు. తెచ్చాక తన దగ్గర చేరుకున్న బుడ్లలోని మందులన్నీ దాంట్లో పోయమన్నారు. తాగేవి, రాసుకునేవీ అన్నీ పోశాక వాటి నన్నింటిని కలిపినదాన్ని రోజూ ఒకగరిటెడు తనకు తాగటానికిమ్మన్నారు. ఇలా కలిపిన మిశ్రమం వల్ల వాటిల్లో కొన్ని విషాలు.

'ఇదేమిటి భగవాన్ ?' అన్నారు.
'అవును, నామీద ప్రేమతో, భక్తితో యిన్ని మందులు, పంపుతారు, యిస్తారు.
ఇవన్నీ ఎట్లా తాగి, రాసుకుని వారిని తృప్తి పరచను? కలిపి తాగేస్తే సరిపోతుంది ' . అన్నారు.

డాక్టరు పరుగెత్తుకుంటూ వచ్చాడు అలోపతీ, ఆయుర్వేదం, హోఇయోపతి మందులు, పూతలు, తైలాలు, విషాలు, అన్నీ చూశాడు. హడలిపోయినాడు. అందరూ కలిసి ఒక్కటే మొర, తాగవదని భగవాన్ తో. బుడ్డి తీసుకుపోయి దాచెయ్యడం చాలా కష్టమైపోయింది.

ఒకసారి భక్తురాలు ఎచ్చెమ్మ తాను చేసిన ప్రసాదం వడ్డించింది భగవాన్ విస్తట్లో.
'ఏమిటి, యింత ఎట్లా తినను?' అన్నారు భగవాన్.
దానికి ఆమె -
'అంతా మాయ కదా!
అన్నమూ మాయె, మీరు తినడమూ మాయె.
దీంట్లో సత్యమెక్కడ వుంది, మీకు జబ్బు చేసేందుకు?' అంది.

భగవాన్ , 'చూశారా, మనం అన్నమాటలు మనకే ఎట్లా వప్పగిస్తారో!' అని నవ్వారు.

భగవాన్! మీరు చిక్కిపోతున్నారు, హార్లిక్సు చేసి తీసుకొచ్చాను.

Saturday, July 4, 2009
ఎవరు ఏ వేళప్పుడు ఏం తీసుకొచ్చినా భగవాన్ తినేవారు. ఆయన వంటికి జబ్బు చేసేది చాలాసార్లు ఆ ఫలహారాలవల్ల, ఎవరన్నా తన దగ్గర వుంటే అందరికీ పంచితీరాలి, ఆ ఫలహారాల్ని. కాని, ఒక్కొక్కరు తీసుకొని వస్తేనా, అదే పనిగా తీసుకొస్తూ వుంటేనూ తాకేవారు కారు, ఆ తీసుకొచ్చిన వాటిని.

ఒక భక్తురాలు హార్లిక్సు చేసి తీసుకువచ్చి పెట్టింది భగవాన్ ముందు తాగమని, అందరిలోనూ,

'ఏమిటిది? నా కెందుకు?'
'హార్లిక్సు. మీరు చిక్కిపోతున్నారు. తాగి తీరాలి ' అందామె.
'నేనేం పాపాయినా? తీసుకుపో!' అని కఠినంగా పంపేశారు.

Freedman అనే భక్తుడు ఒక గ్లాసునిండా నారింజరసం తీసుకొని వచ్చి యిచ్చాడు భగవాన్ కి తాగటానికి. ఆ గ్లాసు తీసుకొని చూసి భగవాన్,
'అంతేనా? ఇది చాలదే?' అన్నారు.
ఇంకా కావాలంటున్నారనుకుని ఆశ్చర్యపడి చూశాడు అతను.
'అందరికీ యివ్వటానికి' అన్నారు భగవాన్ కూచున్న వందలాది భక్తులకేసి చూస్తో.
'కాదు భగవాన్, మీరు పాలిపోయినట్లు కనబడుతున్నారు.
మీరు తాగండి, మీకోసం తెచ్చాను ' అన్నాడు.

'నాకన్న పాలిపోయి కనబడుతున్నావు,
నీకెక్కువ అవసరం, నువ్వు తాగు ' అని ఒక చంచాడు తీసుకొని తక్కింది యిచ్చేశారు.

...దించిన పాపపు మూటని, భుజాన పెట్టుకొని వెళ్ళిపోతాడు

Thursday, July 2, 2009
ఒక భక్తుడు వుండేవాడు.
అతను భగవాన్ దగ్గరకి వచ్చినప్పుడల్లా తన్మయుడై భక్తితో పాటలు పాడి నృత్యం చేసేవాడు.
ఒకసారి అతను వెళ్ళిన తరువాత భగవాన్ రంగన్ తో అన్నారు.
' ఇక్కడికి వొచ్చినప్పుడు ఆ విధంగా ఆనందంతో నృత్యం చేస్తాడు.
వెళ్ళేప్పుడు,
ఇక్కడికి వొచ్చినప్పుడు దించిన పాపపు మూటని,
భుజాన పెట్టుకొని
వెళ్ళిపోతాడు '

విరిగినవన్నీ కూలి ఈశ్వరుడికి | ఈ ముక్కలన్నీ మీవి, తీసుకొచ్చాను

Wednesday, July 1, 2009
సుందరేశయ్యర్ జ్ఞాపకాల్లో ...

ఒక రోజు మా ఆవిడ దోసెలు చేస్తూంది. 'విరిగినవన్నీ కూలి ఈశ్వరుడికి ' అని నవ్వుతూ వెళ్ళిపోయాను. ఆకలితో దోసెలు తినాలని ఇంటికి వచ్చాను. 'అన్ని దోసెలు ముక్కలై వొచ్చాయి.' అని ఆ ముక్కల్ని చూపింది. ఏం చెయ్యను? ఏమి అనకుండా భగవాన్ దగ్గరికి తీసుకొనిపోయి వారి ముందర పెట్టాను.

'ఏమిటిది?' అన్నారు.
'నా భార్య దోసెలు చేస్తోవుంటే నవ్వులాటకి నేను, మాణిక్యవాచకర్ కథలో మల్లే,
విరిగినవన్నీ ఈశ్వరుడికి అనేసి వొచ్చాను.
ఒకటీ సరిగా రాలేదు. ఈ ముక్కలన్నీ మీవి గనక మీకు తీసుకొచ్చాను ' అన్నాను.

నవ్వుతో ఆయన నాలుగు ముక్కలు తిని, తక్కినవి భక్తులకు పంచి పెట్టించారు.

ఒకసారి చిన్నస్వామికి నా మీద అమితమైన కోపంగా ఉంది. ఆ దిగులులో నేను రాత్రి భోజనం చెయ్యలేదు. తెల్లారి ఆకలిగా ఉంది. ఆశ్రమంలో నిలువ మనస్కరించలేదు. భగవాన్ తెల్లారకట్ల ఇడ్లీ చేస్తున్నారు. వెళ్లి నమస్కరించాను. 'ఏమిటి సమాచారం?'
'టవునుకు వెడతాను.'
'ఎందుకు?'
'పిల్లలు ట్యూషన్ కు కాచుకుని ఉంటారు.'
'తెలుసు. నాకు తెలుసు నీ దొంగతనం, ఆదివారంనాడు నీకు ట్యూషన్ ఏమిటి? ఎవరికి చెప్పుతావు? వంకాయ సాంబారు చేశాను మధ్యాహ్నానికని. ఇప్పుడే నీకు వేసి పెడతాను. రా. తిను . పద, కూచో ' అని తొందరగా విస్తళ్ళు వేశారు.

తానూ నా పక్కన కూచుని నా దిగులు మరచిపోయేట్టు ఎన్నో కబుర్లు చెప్పి నవ్వించారు.
అట్లాంటిది భగవాన్ కరుణ.

వంకాయ తొడిమల్ని కూర చెయ్యమన్నారు. తొడిమల కూర? ఎవరు తింటారు?

సంపూర్ణమ్మ జ్ఞాపకాల్లో ...

ఒకసారి జయంతికి ఎన్నో వంకాయలు వొచ్చాయి. వరసగా కొన్ని పూటలు వొండాము. వాటినుంచి కోసిన తొడిమలన్నీ ఓ కుప్ప పడి వున్నాయి, ఏది పారెయ్యడానికి ఎవరికి సాహసం లేదు. వాటిని చూసి భగవాన్, ఆ తొడిమల్ని కూర చెయ్యమన్నారు. తొడిమల కూర! ఎవరు తింటారు?

చేశాం.
వాటిల్లో ఎండు బటానీలు కలిపి , ఎన్ని గంటలు వుడికించినా వుడకవు - తొడిమలుగాని, గింజలుగాని. ఎందుకు వొచ్చారో హాలులోంచి వంటింటిలోకి వొచ్చారు భగవాన్. ఎంత పనిలో వున్నా సరే, మా వంటలో ఏదన్నా సమస్య వొచ్చిందా, ఎట్లా వొచ్చేవారో - మా ఎదుట వుండేవారు. హాలు గుమ్మం దగ్గిర మేము కనపడ్డామా, వెంటనే లేచి వొచ్చేవారు మా వెంట. వంటచేసేవారి పైన వున్న అనుగ్రహం, ఎవరిపైనా వున్నట్టు కనపడేదికాదు, ఆ హాలులో కూచున్న వారిపైన.

'ఎట్లా వుంది కూర ?' అన్నారు.
'కూర ఏమిటి? అవి తొడిమలు కావు. ఇనపగుగ్గిళ్ళు, ఎన్ని గంటలకీ వుడకవు!' అన్నాను.'

ఏం? వుడకలేదా?' అంటూ ఓసారి గరిటతో తీసి చూసి, కలిపి, ఏ ఉపాయం చెప్పకుండానే వెళ్ళీపోయినారు.

వెళ్ళి చూస్తే -
తొడిమలు, ఎండు బటానీలు అన్నీ వుడికి వున్నాయి.
ఆ రాత్రి అందరూ చాలా బాగా తిన్నారు. ఆ కూర ఏమి కూర అని అడిగారు తినేవారు. ఎవరూ చెప్పుకోలేకపోయినారు. వొక్కసారే వొడ్డించాను అంత కష్టపడి చేసిన కూరని, భగవాన్ కి అంతా. అంతా ఒక్క ముద్దగా నోట్లో వేసుకుని మింగేశారు. నా ప్రాణం చివుక్కుమంది. అంత రుచైన కూరని, అంత కష్టపడి చేసిందాన్ని అట్లానా తినడం? తరువాత ఎన్నిసార్లు కూర వొడ్డిస్తానన్నా, వొద్దన్నారు.

మర్నాడు అన్నారు ఎవరితోనో, 'రాత్రి నేను కూర తినలేదని సంపూర్ణమ్మ మనసు నొచ్చుకుంది. నేను తింటేనేం, తినకపోతేనేం? తను శ్రద్దగా చేసింది నేను తిన్నట్టే ' అని. భక్తులకన్న స్వామికి ఎక్కువ వెయ్యాలని నా మనసులో ఏ మూలన్నా వుందో ఏమో ఆ వ్యత్యాసాన్ని తీసేసే సాధనం తాను తినకపోవటమే!

వంట బాగా వొచ్చినా, చెడిపోయినా, దాంట్లోంచి మాకో వేదాంతం. ఆ వాక్యాలే, ఎటు పడితే అటు అర్థం తీసుకునేవిగా వుండేవి. ఓసారి సేమియా పుట్టు చేస్తో వున్నాము - జాగర్తగా పొడి పొడిగా వొచ్చేట్టు.

భగవాన్ వొచ్చి అంతా అణిచేశారు. 'ఇదేమిటి భగవాన్, ఇట్ల అణిచివేశారు? అంతా ముద్దయి పోయిందే? ' '
అవును, విడివిడిగా వుంటే ఏం బావుంటుంది ? అంతా ఏకంకావాలి.'

చాలా రుచిగా వుంది సేమియా పుట్టు ఆ రోజున.

భగవాన్ స్మృతులు | చలం - 6 | 'తిట్టేవారు. ధిక్కరించేవారు. నువ్వెంత అని ప్రశ్నించేవారు. . .'

Tuesday, June 30, 2009
వారిని దర్శించడానికి వచ్చేవారు కూడా వారిని చూడగానే అనేక విధాల reactions చూపేవారు. ధ్యానంలో పడేవారు. indifferentగా లేచిపోయేవారు. నవ్వేవారు పాపులమని ఏడ్చేవారు. అరచేవారు. హిస్టీరియాలోకి పోయేవారు. వెనక్కు విరుచుకుపడేవారు. స్తుతించేవారు. శ్లోకాలు చదివేవారు. అశుకవిత్వంలోకి break అయేవారు. ఆయన్ని కౌగలించుకోవాలని ఆయన వేపు పరిగెత్తేవారు. ఒకటే అంతులేని నమస్కారాలు పెట్టేవారు. ఆయన పాదాలు అద్దుకోవాలనుకునేవారు. తిట్టేవారు. ధిక్కరించేవారు. నువ్వెంత అని ప్రశ్నించేవారు. పాడేవారు. సోఫా దిగి, లోకాన్నుద్దరించమనేవారు. మూర్చలు పోయేవారు. ఒళ్ళు తెలియక తన్నుకునేవారు.

ఆశ్రమం వారు భోజనం పెట్టము పొమ్మంటే, ఒక్కొక్కరే సరాసరి భగవాన్ దగరికి వచ్చి భోజనం పెట్టించమని అడిగేవారు. భగవాన్ కొందరితో అసలు మాట్లాడరు. కొందరితో 'నాకు వీళ్ళు పెడుతుంటే తింటున్నాను. వీళ్ళు పొమ్మంటే నేనూ పోవాలి. నాకేం అధికారముంది?' అని వూరుకునేవారు. ఇంకొకరు అడిగితే, దగ్గర వున వాళ్ళని పిలిచి అన్నం పెట్టించమని పంపేవారు. ఒక్కొక్కరిని పిలిచి 'భోజనం చేశావా? వెళ్ళి చెయ్యి ' అనేవారు.

ఆశ్రమానికి డబ్బు కూడిన మొదటి రోజుల్లో, ముందు వాకిట్లో కాచుకొని వున్న బీదలకి, ఆవులకి, తక్కిన ప్రాణులకు భోజనం పెడితే కాని భగవాన్ భోజనానికి లేచేవారు కారు. ఆశ్రమంవారు బీదలకి వేరే పల్చని సాంబారు వొండితే, వారితో పోట్లాడి, తానా పల్చని సాంబారు వేసుకుని, వారికి మంచి సాంబారు పోయించేవారు. తను తినే ఇడ్లీలు ఆవులకు పెట్టించేవారు. ఆశ్రమం వారికి ఆ పనులు చాలా కష్టంగా వుండి, యెట్లాగన్నా ఆయన కన్ను కప్పాలని చూసేవారు. విసుగు పుట్టి ఆయన ఆ విషయమై కల్పించుకోవడం మానేశారు. తన భక్తులకి భిన్నంగా తనకేమి అధికంగా పెట్టినా ఉగ్రులయేవారు. తనకి జబ్బుగా వున్నా తనకి తెచ్చిన పళ్ళు పలు అందరికీ పంచాల్సిందే. ఆ విధంగా తనకు ప్రత్యేకత చూపించినందుకు కోపించి - కాఫీ - పాలు మానేశారు భగవాన్ , చాలాకాలం.

భగవాన్ కి ఎప్పుడూ ఏదో జబ్బు చేస్తూనే వుండేది. మందులిప్పించ చూసేవారు. ఎప్పుడూ భగవాన్ మందులు వద్దనేవారు. కాని, వొత్తిడి చేస్తే మీ ఇష్టం కానిమ్మనేవారు. తరువాత ఏ మందులు యెంతకాలం పోసినా మింగేవారు. చివరిదశలో ఆయన దేహాన్ని అంతం చేసిన కురుపు లేచినపుడు ఏ మందూ, ఏ కోతా వద్దన్నారు. ఎట్లా వచ్చిందో అట్లానే పోతుందన్నారు. కాని, రెండుమూడేళ్ళు దానికోసం పోసిన మందల్లా తాగారు. కోసినకోతల్లా కోయించుకున్నారు.

ఏది ఏమైనా ఈ జ్ఞానులందరూ ప్రేమమయులు.
వారు ఏది చేసినా యెట్లా చేసినా అది వారినాశ్రయించినవారి పురోభివృధ్ధికే జరిగేది.

భగవాన్ స్మృతులు | చలం - 5 | ' స్థానం కోసం పోట్లాడుకునేవారు ఘరానా పెద్దలు . . .'

Monday, June 29, 2009
భగవాన్ యే ఆచారాలను పాటించేవారు కారు. తన దగ్గర చేరిన ఆచారవంతుల్ని, ఆ ఆచార బంధనాలనుంచి తప్పించాలని చాలా ప్రయత్నించారు. అంతటి గురువుని యెదురుగా పెట్టుకొని, ఆయన్ని సాక్షాత్ ఈశ్వరావతారమని స్తుతిస్తో - గర్వపడుతూనే, వారి దేవతార్చనలు, వ్రతాలు, మొత్తుబళ్ళు, తీర్థయాత్రలు సమస్తమూ చేస్తోనే వుండేవారు భక్తులు. భగవాన్ని అడిగితే, 'ఏదీ వొద్దు. నిశ్చలంగా కూర్చో. అదే ఉత్తమమైన యాత్ర. . . ' అంటో వారిస్తూ వున్నా పోతూనే వుండేవారు. ఆయన గొప్ప భక్తురాలు, ఎచ్చెమ్మ, ఒకసారి లక్ష తులసి పత్రి వ్రతం చేసి , అలా చేశానని భగవాన్ తో చెప్పుకుంది. 'ఆ చెట్టుని అన్నిసార్లు గిల్లడం కన్న, లక్షసార్లు నిన్ను నువ్వు గిల్లుకోకపోయినావా? ' అన్నారట.

తల్లి చచ్చిపోయిన ఉడత పిల్లని పెంచి, కిందపడి బీటలుపడ్డ పిచిక గుడ్డును తాను స్వయంగా జాగ్రత్తచేసి, పిల్ల ఐతే అందరికీ చూపి ఆనందించేవారు భగవాన్, కాని, ఆయనకి చాలా ఆత్మీయులని అందరూ అనుకునేవారు చచ్చిపోతే, 'అట్లాగా!' అని వూరుకొనేవారు.

పుస్తకాలు బైండువేస్తూ వుంటే, అలమారు చేస్తోవుంటే , ఆ చేసే వారిని విసిగించి, బలవంతం చేసి, పావు అంగుళంలో పదో వంతు కొలతలు కూడా సరిచేయించే వారు. వంటలూ అంతే. ఎట్లా వుండాలో, అన్నో details చెప్పి, చేయించి సరిగా చేస్తున్నారో లేదో లేచి వెళ్ళి చూస్తో వుండేవారు. మళ్ళీ యెంత విలువైనవి కనపడలేదన్నా, పాడైనా ఆయన వినిపించుకోనన్నా వింపించుకోరు.

ఆయన ముందే హాల్లో స్త్రీలను గడకర్రలు పెట్టి నెట్టేవారు సేవకులు. స్థానం కోసం పోట్లాడుకునేవారు ఘరానా పెద్దలు. భోజనం దగ్గర కూచున్న కొత్త వాళ్ళని బయటికి గెంటేవారు. అయినా అట్లా చూస్తో వుండేవారు భగవాన్. కాని, ఒక పిట్టకు, ఒక చెట్టుకు ఏ హాని కలిగినా జాగ్రత్తగా నయం చేసేవారు. హాని చేసేవారిని చూసి ఉగ్రులయేవారు. ఆశ్రమంలో ఏది జరుగుతున్నా ఏమి పట్టించుకోరనీ, అన్నిటికీ ఆయన అతీతులనీ అనిపించేది. ఇంకోప్పుడు ప్రతి చిన్న విషయమూ పట్టుకుని సాగదీస్తో వుంటే, ఆశ్చర్యం వేసేది.

ఎంత గొప్పతనం, ఐశ్వర్యం, అందం, అధికారం లోకంలో ఔన్నత్యం, ఆధ్యాత్మిక సాధన, తపస్సు, కీర్తి, లోకోపకారం, స్వార్థ రాహిత్యం ఆయన ముందు ఏ difference చెయ్యదు. తలెత్తి చూడరు. ఎవరన్నా introduce చేసినా పలుకరు. ఒకర్ని చూసి నిష్కారణంగా పలకరిస్తారు. నవ్వి ఆదరిస్తారు. వారినే మళ్ళీ indifferent గా చూస్తారు. ఒకరు యెంత silly ప్రశ్నలు వేసినా సావధానంగా జవాబు చెబుతారు. వాళ్ళ level కి వచ్చి, ఇంకొకరికి అసలు జవాబు చెప్పరు, ఒకటే ప్రశ్నయినా.

'ఇంకా లోకాలున్నాయా? జన్మలున్నాయా ?' అంటే
'ప్రశ్నించే వారెవరు ?' అంటారూ.

ఇంకొకరికి తక్కిన లోకాలసంగతి, చావు అంటే ఏమిటో - అంతా detailed గా explain చేస్తారు.

భగవాన్ స్మృతులు | చలం - 4 | ' ఒక్కొక్కసారి భగవాన్ పడిపోయేవారు కూడా . . .'

Saturday, June 27, 2009
భగవాన్ని పలకరించడమంటేనే యెంతో భయం. ఏ అధికారమూ, పరివారమూ లేని, బలంలేని ఆ వృధ్ధ స్వరూపం ముందు, గొప్ప పదవుల్లో, అధికారాలలో వుండేవారు, అతి గర్విష్టులు, సైన్యాధికారులు నమస్కరించడానికి వొణికిపోయేవారు. రోజుకి మూడు నాలుగుసార్లు, ఆశ్రమం నించి కొండమీదికి వెళ్ళేవారు భగవాన్. ఆయన ముందు నడుస్తో, వెనక కమండలం పట్టుకుని శిష్యుడూ, ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వుండేవారు. అప్పుడప్పుడు కొండను ఇటూ అటూ చూసి, వెనక్కి తిరిగి శిష్యుడికో చల్లగా మాట్లాడుతూ వుండేవారు. కింద నుంచున్న నా బోటివారు తదేక దృష్టితో ఆయన వంకే చూస్తో, నుంచునేవారు, వారు కనుమరుగయిందాకా, ఏమనిపించేదంటే - అట్లా ఒక్కొక్క మెట్టే యెక్కుతో కొండ చివరికి వెళ్ళి, అక్కడనించి అట్లా ఆకాశంలోకి మాయమై ఇంక తిరిగి రారేమోననిపించేది ప్రతీసారీ.

భగవాన్ చివరి రోజుల్లో కురుపు లేచి ఆపరేషన్లు అయి శరీరం బలహీనమైన తరువాత ఆయన సోఫా మీదనుంచి లేవడానికి చేసే ప్రయత్నం చూస్తే చుట్టూ కూచున్నవారికి ఆ బాధ తను దేహాలలో పలుకుతున్నట్లుండేది. అట్లా బాధ పలకడానికే ఆయన ఆ నెప్పిని పోగొట్టుకునేవారు కారేమో! ఆయన పొందిన మహోన్నత స్థితీ, అనిర్వచనీయమైన ఆనందమూ, అవే కాదు, ఆయన శరీరానికి తటస్థించిన బాధలు కూడా యీ ప్రజల కోసమే గావును! కొన్ని ఏళ్ళు ఆయనకు మోకాళ్ళు నెప్పులు వుండేవి. ఎవరో ఒకరు పంపిన ముందు తైలాన్ని మర్ధన చేస్తోనే వున్నారు, పిసికేవారు.

సోఫామీదనించి లేస్తో భగవాన్ తన మోకాళ్ళని పిసుక్కునేవారు. ఎవరన్నా పిసకపోతే 'వుండవయ్యా! అంతపుణ్యమూ మీకేనా, ఈ మోకాళ్ళని పిసికి నన్ను కొంచెం పుణ్యం సంపాయించుకోనీ ' అనేవారు. ఆయన లేచి నుంచుని కర్రనానుకుని ఒక్కొక్క అడుగు వేస్తోవుంటే, భక్తుల్లో ప్రతివారి వూపిరి యెగిరిపోతూ వుండేది, ఆయన వేసే ప్రతి అడుగుకి.

ఆశ్రమాధికార్లు కట్టించిన కొత్త హాలు రాతి గుమ్మం దాటాడం, అతి ప్రయాస అయేది భగవాన్ కి. చూసేవారికి, చిన్న పిల్లలకి కూడా యెట్లనన్నా కూడా ఆయన్ని పట్టుకుని దాటించాలనిపించేది. కాని తమ భుజాల్ని వూతగా ఇవ్వాలని వెళ్ళే పరిచారకుల్ని విదిలించి పంపించేవారు భగవాన్.

ఒక్కొక్కసారి ఆయన పడిపోయేవారు కూడా. కాని సహాయం మాత్రం తీసుకునేవారు కాదు.

భగవాన్ స్మృతులు | చలం - 3 | 'చాలాసార్లు భగవాన్ మీదే ఆంక్షలూ...'

Friday, June 26, 2009

contd from here


ఆశ్రమంలో తనకి ఇష్టంలేని పని కాని, తను వొద్దన్న పనికాని జరుగుతూ వుంటే పిలిచి చీవాట్లు వేసేవారు. కాని, అప్పటి కి వినకపోతే మాట్లాడకుండా వూరు కొనేవారు. చాలాసార్లు భగవాన్ మీదే ఆంక్షలూ, ఆజ్ఞలూ పెట్టేవారు ఆశ్రమాధికార్లు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటలదాకా భగవాన్ని ఎవరూ చూడకూడదని నిర్ణయించి, భగవాన్ని, అడగకుండానే హాలు తలుపులు వేయించి వేశారు.



భగవాన్ 'ఇదేమిటి? ' అని అడిగితే, 'మీ ఆరోగ్యం కోసం ' అన్నారు. తలుపులు మ్య్యడానికి వీల్లేదనీ, 24 గంటలూ తలుపులు తెరిచి వుండాలనీ భగవాన్ అన్నా, వినిపించుకోలేదు అధికార్లు. అందుకని ఆయనే హాల్లోంచి బైటికి వొచ్చి కూచున్నారు. కాని, అప్పటికీ ఆశ్రమంవారు ఆయన మాటవినలేదు. ఒకటే బతిమాలారు. చివరికి అట్లాగే కానీ అని హాల్లోనే వుండిపోయినారు భగవాన్. అనేకమంది భగవాన్ కని ఫలహారాలు తెచ్చిపెట్టేవారు, వేళగాని వేళలకూడా ఆయనకి అని జీర్ణమవుతాయా, లేదా అనే ఆలోచన కూడా లేకుండా. చాలాసార్లు తిని బాధపడేవారు భగవాన్. ఒకరు యెంత తెచ్చిపెట్టినా తినేవారు. ఇంకోరు యెంతో భక్తితో విలువైన ఫలహారాలు పెట్టి తినమంటే- అటు తలతిప్పి కూడా చూసేవారు కారు. కొందరు ఆయన ముందు ఫలహారం పెట్టి, ఆయన పలక్కపోతే, అట్లానే చేతులు కట్టుకుని నించుని , నించుని , ఇంక గతిలేక వెళ్ళిపోయేవారు. ఒకరి చేతినుంచి ఇవాళ తిని ఇంకోసారి వాళ్ళు తెస్తే, వాళ్ళవంక చూడనే చూడరు. భగవాన్ demeanour ఎప్పటికప్పుడు మారేది.



ఆయన ఏ ఆనంద నిబిడీకృతమైన తేజోశూన్యంలోకో కిటికీలోంచి దిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నప్పుడు, ఆయన ధ్యానముద్రలో కూచున్న సాక్షాత్ దక్షిణామూర్తి అనిపించేవారు. ఫోజులేని ఆ శాంభవీ ముద్ర యెంతో ఆర్టిస్టిక్ గా వుండేది! ఆ అందం నించి కళ్ళు తిప్పుకోలేక పోయేవాళ్ళం. కదలని సూర్యోదయాన్ని చూసినట్లుండేది. ఆయన ముఖంకాని , ఆయన దేహం కాని, మామూలుగా అందాలు అలవాటైనా నా కళ్ళకి అందంగా కనపడేవి కావు.



కాని, ఆయన నిశ్చలంగా, గంభీరంగా కూచున్నారా - (ఆయన దేహం అట్లాగే వుండేది ) కాని, మరి ఏమిటో యింత అందం, ఇంత లావణ్యం! అవేం కాదు, ఏదో మనకు అలవాటైన సౌందర్యాలకి art కూడా అందుకోలేనిదేదో ఆయన్ని వెలిగిస్తున్నట్టుండేది. ఒక్క కౌపీనం పెట్టుకున్న ఆయన , చక్రవర్తి దుకూలాలు కట్టుకుని, రాజలాంఛనాలతో, నవ రత్న సిమ్హాసనంపై కూచున్నట్లుగా వుండి దిగ్ర్భమ చెందేవాళ్ళం.



ఆ స్థితిలోనైనా సరే, ఎవరన్నా 'భగవాన్ ' అన్నారూ - ఎక్కడనించి దిగివొచ్చేదో ఆయనకి యీ లోకస్మృతి,

కాని సర్వాంతర్యామి అయిన ఆయన దృష్టి దిగిరావడమేముంది!

భగవాన్ స్మృతులు | చలం - 2 | భగవాన్ ఆయుష్షు కోసం గ్రహశాంతి, హోమాలు. . .'

Thursday, June 25, 2009


భగవాన్ జబ్బుగా వున్నప్పుడు ఆయన ఆయుష్షు కోసం గ్రహశాంతి, హోమాలు చేశారు. దాంట్లో వుండే Anomaly ఏమీ తోచలేదు, ఆయన ఆయుష్షు కోరేవారికి. ఆ హోమాలు , హారతులు, తీర్థం తీసుకున్నారాయన. తనకు జబ్బు చేస్తే మందు అవసరం లేదంటారు భగవాన్. కాని భక్తులు దిగాలుపడ్డా, మందు తీసుకోమని బతిమాలినా, 'సరే, తెండి ' అని, ఏ మందిచ్చినా అట్లా మింగుతూనే వుండేవారు. వొచ్చిన ప్రజలు సాష్టాంగపడి నమస్కరించేవారు. కాని, భగవాన్ తలతిప్పి కూడా చూసేవారు కారు. కాని, ఎందుకో ఎప్పుడో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నవారు కాస్తా, చప్పున తనకు నమస్కరించేవారి వంక చూసేవారు. ఒక్కొక్కరిని పలకరించేవారు కూడా , నవ్వేవారు. ఎన్నో కుశల ప్రశ్నలు వేసేవారు. దూరదేశాల నించి వొచ్చిన వారిని, పసిపిల్లలని, నడవలేని వృద్దుల్నీ ప్రత్యేకంగా చూసేవారు. అధికారులు, బిచ్చగాళ్ళు, ధనవంతులు, సన్యాసులు, భక్తులు, స్త్రీలు - ఎవ్వరూ దృష్టిని తీసుకోలేకపోయారు.

కొందరు ఎన్నో ప్రశ్నలతో వచ్చి, అడగడం ప్రారంభిస్తే ఎంతకీ పలికేవారు కారు. ఒకర్ని పిలిచి పలకరించి, ఎన్నో విషయాలు చెప్పేవారు. కొందరిని ఏ కారణం లేకుండా, తనని పలకరించగానే కసిరికొట్టేవారు. కొందరిని గట్టిగా తిట్టేవారు. హాస్యం పట్టించి, వెక్కిరించి, అందరూ నవ్వేటట్లు చేసేవారు. కొందరు భక్తులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తరువాత భగవాన్ కలల్లో కనపడి రమ్మంటారు. లేదా, ఆ భక్తుడినే యెంతో నిలువలేని ఆతృత కలుగుతుంది. భగవాన్ని యెప్పుడు చూస్తానా అని, దూరాల నించి ఇబ్బందుల్లోనుంచి ఏదీ లక్ష్యం చేయక యెప్పుడు అంటూ వొస్తాడు ఆశ్రమానికి.

అతను వొచ్చేప్పతికి భగవాన్ తల రెండోవేపు తిరిగి వుంటుంది. అటు చూడరు, పలకరించరు, చిరునవ్వు నవ్వరు కొన్నిరోజులు. యీ లోపల యెందర్ని పలకరిస్తారో? ప్రేమగా పిలిచి, మాట్లాడి కుశల ప్రశ్నలు వేస్తారో!

కొందరు వుండేవారు. వారికి అందరిముందూ భగవాన్ తో మాట్లాడడం గొప్ప. అందరివంకా చూస్తో, కాయితాలో పుస్తకమో పట్టుకుని, ఏదో సందేహాన్ని కల్పించుకుని వెళ్ళీ భగవాన్ని పలకరించి మాట్లాడతారు - మధ్య మధ్య చుట్టూవున్న వారివంక గర్వంగా చూస్తో. యెంతో దూరం నించి వొచ్చి త్వరలో వెళ్ళవలసిన ఇంకోరు తమ సందేహాలతో రోజులకి రోజులు వుండిపోవలసిందే. యెవ్వరికేది అవసరమో, ఏది వారిని తనకి కట్టివేస్తుందో, ఏది వారి అహాన్ని అణుస్తుందో - ఆ విధంగా జరిగిపోయేది భగవాన్ ద్వారా.

భగవాన్ స్మృతులు | చలం - 1 | 'లోకంలో జరిగే అత్యాచారాలకీ, ఈశ్వరుడికీ సంబంధం..'

Tuesday, June 23, 2009


భగవాన్ జీవితంలో ఎన్నో విషయాలు అర్థంకావు - అయన మానవాతీతుడు. ఆయనలో కనపడే వైరుధ్యాలకి మానవుల్లో వెతికినట్లు కారణాలు వెతకటం కాని, విమర్శించడంగాని అజ్ఞానం , ఏ మనిషికి అవసరమైనట్టు ఆ విధంగా మాట్లాడేవారు, ఆచరించేవారు ఆయన. తన చుట్టూ ఆశ్రమంలో జరిగే వాటిలో ఆయనకి ఎంతసంబంధం వుందో చెప్పలేం. సంబంధం వుండనూ వుంది. ఉండనూ లేదు. లోకంలో జరిగే అత్యాచారాలకీ, ఈశ్వరుడికీ సంబంధం వున్నట్టా, లేనట్టా? ఆశ్రమాధికారులూ, ఆశ్రమవాసులూ తరచు ఆయనని అడక్కుండానే ఎన్నో చేసేవారు, భగవాన్ కి ఇష్టం కాదని తెలిసికూడా.

ఆ పనులు భగవాన్ కంటనో, చెవినో పడితేనే గాని, భగవాన్ వాటిని గమనించేవారుకారు. గమనించినప్పుడు ఒక్కొక్కసారి పిలిచి చీవాట్లు వేసే వారు. ఒక్కొక్కసారి యేమీ అనేవారు కారు. ఆశ్రమాధికారి (భగవాన్ తమ్ముడు - చిన్నస్వామి ) మాత్రం భగవాన్ కంటపడకుండా, నిరంతరం నేరస్థుడివలె ఇటూ అటూ తప్పుకు తిరిగేవాడు.

భగవాన్ని దర్శించవచ్చినవారు ఆశ్రమంలో జరిగే ఘోరాలు, అన్యాయాలు, పక్షపాతాలు, డబ్బుగుంజడాలు - ఇవి భగవాన్ తో చెపితే, 'మీరెందుకు వొచ్చారు? ఈ ఆశ్రమంలో జరిగే లోపాల్ని యెంచి సంస్కరించేందుకా అంత దూరం నుంచి వచ్చారు? మీ దేశంలో ఏమీ లేదా సంస్కరించేందుకు? మీరు వచ్చిన పని ఏదో అది చూసుకుని వెళ్ళరాదా?' అనేవారట. ఆశ్రమ ధనం దుర్వినియోగమవుతోందనీ, ధనార్జనే ముఖ్యంగా వుందనీ భగవాన్ తో అంటే, 'వాళ్ళు ధనం కోసం చేరారు, నీకూ ఆ ఆశ వుంటే వాళ్ళలో చేరి చూడు. భాగం పెడతారేమో?' అన్నారట.

తన పేర నెలనెలా వసూలవుతున్న ధనం యెట్లా వినియోగమౌతోందో భగవాన్ పట్టించుకోలేదు. తన పేర యాచించడం భగవాన్ కి యెన్నడూ ఇష్టం లేదు. లక్షలు ఖర్చు పెట్టి కట్టించిన ఆశ్రమాలయానికై యాచించకపోతే, గట్టిగా నిషేధించారు భగవాన్. కాని, విన్నదెవరు? అయినా, పూజలూ, ఊరేగింపులూ, ఉత్సవాలు - ఏవీ లక్ష్యం లేవు భగవాన్ కి. ముఖ్యంగా తనమీద పువ్వులు వెయ్యడం, తనముందు కొబ్బరికాయలు కొట్టడం, హారతులివ్వడం మొదలైనవి ఇష్టం లేదు. పుట్టిన జయంతి చేసినా, చేస్తున్నారు గనుక చూస్తూ కూచునేవారు - కూచోమంటే.

ఆయన దేవతా విగ్రహాల కిచ్చిన హారతి తెచ్చి యిస్తే అందరికి మల్లేనే కళ్ళ కద్దుకుని, విభూతి పెట్టుకునేవారు.

భగవాన్ కి ఆ రాత్రి భోజనం లేదు

Sunday, June 21, 2009
ఒకసారి చంద్ర గ్రహనం: సాయమ్రం 5:30 గంటలకే భోజనానికి గంట కొట్టారు, భోజనాలు గ్రహణానికి ముందే తినాలని, ఆ సంగతి ముందే భగవాన్ తో చెప్పలేదు. అందరూ వెళ్ళి కూచున్నారు, విస్తళ్ళముందు.

'ఆ గంట ఏమిటా?' అని అడిగారు భగవాన్.
'గ్రహణానికి ' అని చెప్పారు. విని 'అట్లాగా ' అని వూరుకున్నారు.
భగవాన్ భోజనానికి లేవలేదు. భోనజానికి పిలిస్తే వినిపించుకోలేదు.

చూసి చూసి ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలినవారు భోజనం చెయ్యకుండానే లేచి వచ్చారు.భోజనానికి మామూలుగా గంటకొట్టే సమయానికి 7:30 కి భగవాన్ గడియారం వైపు చూశారు. కాని ఎవరూ మాట్లాడలేదు. వారిని ఎవరూ పిలవలేదు. గంట కొట్టలేదు. గ్రహణం అయిపోయింది. 9:30 కి భోజనానికి గంట కొట్టారు. భగవాన్ లేవలేదు. అందరూ వెళ్ళి భోజనం చేశారు.

భగవాన్ కి ఆ రాత్రి భోజనం లేదు , కొందరు మాత్రం 'భగవాన్ భోజనం చెయ్యలేదు ' అని కలవరపడ్డారు.

భగవాన్ ! ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి

రమణ మహర్షి ధ్యాన సంపత్తిని సముద్రాలు దాటించి మహర్షిని విశ్వర్షిగా మలిచిన తొలి పాశ్చాత్య భక్త వరేణ్యుడు పాల్ బ్రంటన్. పాల్ బ్రంటన్ ఇంగ్లండులో ప్రముఖ జర్నలిస్టు. మంచి రచయిత, సాహితీపరుడు. ఆంత్రోపాలజీ, మతం వంటి విషయాలపట్ల ఆసక్తి కలవాడు. చేస్తున్న ఉద్యోగం వదిలి 1930 లో భారతదేశం వచ్చాడు. భారతదేశంలోని యోగులు,మహర్షులపైన పరిశోధన చేయాలన్నది అతని సంకల్పం. భారతదేశం వేదభూమి, కర్మభూమి, తపోభూమి. ఇక్కడ అడుగడుగునా యోగులుంటారని, ఇది అంతా కీకారణ్యమని పాశ్చాత్యుల భావన.పాల్ బ్రంటన్ తన తత్వజిజ్ఞాసలో భాగంగా చాలా దేశాలు పర్యటించాడు. ఈజిఫ్టులో రహస్య స్థావరాలలో ఉండే మాంత్రికుల్ని, తాంత్రికుల్ని కలిశాడు. ముంబాయిలో మహమూద్ బే అనే సూఫీ యోగి ని కలిశాడు. నాసిక్ లో మెహర్ బాబాను, ఆయన గురువును దర్శించాడు. పూనేలో బాబాజాన్ ని పరిచయం చేసుకున్నాడు. సుఖానంద రాజగోపాలస్వామిని, కాంచీపురంలో శంకరాచార్యను కలుసుకున్నాడు.

కంచి శంకరాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామిని సేవించి తనకు జ్ఞానమార్గం చూపమని అర్థించాడు. ఆయనే పాల్ బ్రంటన్ ను రమణ మహర్షివద్దకు వెళ్లమని సలహా చెప్పాడు. తన శిష్యుడు వెంకటరమణిని బ్రంటన్ కు తోడుగా పంపారు. తాను దేశ పర్యటనలో వున్నానని, తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పమని మరీ చెప్పి పంపారు. కంచి శంకరాచార్య రమణ మహర్షిని తన హృదయస్థ గురువుగా భావించేవారు.

పాల్ బ్రంటన్ మద్రాసు నిండి తిరువణ్ణామలై చేరుకున్నాడు. ఆశ్రమం చేరి మహర్షికి నమస్కారం చేసి ఎదురుగా కూర్చున్నాడు. మహర్సి సన్నిధిలో చాలా మంది భక్తులున్నారు. అందరూ నిశ్శబ్దంగా, ధ్యానంలో ఉన్నారు. మహర్షి ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నారు. భక్తుల తృప్తికోసం అలా కూర్చున్నారేమో అనిపించింది. అంత నిబ్బరంగా, ప్రపంచ, పరిసరాలు ఏవీ పట్టనట్లు ఉండడం ఎలా సాధ్యం !

అలా అనుకున్న మరుక్షణంలో అతని మనస్సు శూన్యమైంది. నిరామయమైంది. లోపల ఒక్క భావం కదలడం లేదు. తనలో చకచక వస్తున్న మార్పులకు ఉక్కిరిబిక్కిరైనాడు. తన చూట్టూ కాంతి ప్రవాహాలు, తనలో శాంతి తరంగాలు. ఆలోచనలతో కలవరపడే మనస్సు క్షణంలో నిర్మలమైంది. ఇది ఎలా సాధ్యం? ఆ క్షణంలో అనిపించింది 'మనిషి వివేకమే సమస్యల్ని సృష్టిస్తుందని '. ఆ వివేకమే తను సృష్టించుకున్న సమస్యలకు పరిష్కారం వెదుకుతుంది. రెండింటికీ మనసే మూలం, ఆధారం. తనలో అంతటి శాంతికి, ప్రశంతతకి కారణం మహర్షి దర్శనం, మహర్షి వీక్షణం. ఆ విషయం తెలుసుకోడానికి క్షణకాలం పట్టలేదు బ్రంటన్ కు.

ఆ తర్వాత పాల్ బ్రంటన్ భగవాన్ తో చాలాసార్లు సంభాషణలు జరిపాడు. వాటిల్లో కొన్ని

'ప్రపంచ భవిస్యత్తు ఎలా ఉంటుంది? ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి!'
'భవిష్యత్తు గురించి ఇప్పుడెందుకు ఆలోచన. ప్రపంచం గురించి మీరెందుకు విచారిస్తారు? మీకు వర్తమానం తెలియదు. వర్తమానం గురించి తెలియనివారు భవిష్యత్తును ఏం బాగు చేస్తారు? మీరు ప్రస్తుతాన్ని చక్కదిద్దుకోండి. భవిష్యత్తు తన పని తను చూసుకుంటుంది.'

'భగవాన్ ! ప్రపంచ దేశాల మధ్య ఇకనైనా మైత్రి నెలకొంటుందా? లేక ఇలాగే వినాశం వైపు పరుగులు తీస్తుందా?'
'పాల్! లోకాన్ని పాలించే వాడొకడున్నాడు. తను చూసుకుంటాడు ప్రపంచం సంగతి. ఈ ప్రపంచం బాధ్యత ఆయనది, ఆ పని నీది కాదు.'

'ఏమిటో భగవాన్ ! చుట్టూ చూస్తుంటే అంతా అయోమయం. ఎక్కడ సహాయానుభూతి కనిపించదు. '
'నీవు ఎంతో ప్రపంచమూ అంతే. నిన్ను నీవు అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని ఏం అర్థం చేసుకుంటావు! అయినా అది సత్యాన్వేషుల పని కాదు. అలాంటి ప్రశ్నలతో కాలాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దు. ముందుగా నీ వరకు సత్యాన్ని అన్వేషించు. సత్యాన్ని తెలుసుకో. తర్వాత నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రాపంచిక సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్నది నీవొక్కడివే కాదు. ప్రపంచం నీ వొక్కడితో లేదు. అసలు ప్రపంచానికి నీవు భిన్నం అని ఎందుకనుకుంటున్నావు?'

భగవాన్! పునర్జన్మలు వున్నాయా? మరణం అంటే ఏమిటి? మళ్లీ పుట్టడం ఎందుకు ?

Saturday, June 20, 2009
1938 నవంబరులో రమణాశ్రమం వచ్చిన స్పానిష్ అమెరికన్ వనిత మెర్సిడెజ్ డి. అకోస్తా. ఆమె రమణ భక్తురాలు. హాలీవుడ్ సినిమాలకు స్క్రిప్ట్ రాస్తుంది. 24 సం. తర్వాత ఆమె ఒక పుస్తకం రాసింది. 'Here lies the heart' ఆ పుస్తకం పేరు. అందులో ఆమె పాతికేళ్ల భక్తి నిక్షిప్తం చేసింది. ఆమె మొదట పాల్ బ్రంటన్ ' Search in secret India ' చదివి ప్రభావితురాలైంది. ఆమె అంటారు 'ఆ పుస్తకం చదివిన తర్వాత నాలుగు రోజుల పాటు నేను వేరొక విషయం ఆలోచించలేకపోయాను. నా మనసంతా శూన్యమైంది. నన్ను రమణ మహర్షి ఆత్మ పూనినట్లయింది. ఎవరితో మాట్లాడబుద్ది అయ్యేది కాదు. నేను మహర్షిని కలుసుకోగలనని గట్టిగా నమ్మకం కలిగింది. '

ఆమె రమణ సన్నిధికి వచ్చి వాలిపోయింది. ఏ ప్రశ్నలు అడగవలసిన అవసరం కనిపించలేదు. ఆమెకు అనుమానాలన్నీ తీరిపోయాయి. ఎన్నో ప్రశ్నలు తయారు చేసుకుని వచ్చి, చివరికి రెండే ప్రశ్నలు అడిగింది భగవాన్ ని.

'నా అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోమంటారా ? '
'నీ అంతరాత్మ గురించి నాకేం తెలుసు. నీ ఆత్మ చెప్పినట్లు చేయి.
ఆత్మ నడిపించినట్లు నడువు. ఎవరు ఎవరినీ అనుసరించవలసిన పనిలేదు. '

'మతాలు, గురువుల్ని గురించి?'
'హృదయంలోకి చొచ్చుకుపోతే మతాలుండవు. గురువులుండరు.
ఆత్మ దర్శనమవుతుంది. అది చాలు.'

మొదటిసారిగా డి. అకోస్తా మహర్షిని కలిసినప్పుడు ఆయన పాదాల చెంత ఎదురుగా కూర్చుని ఆయన కళ్లలోకి చూసింది . మహర్షి ఆమె కళ్లలోకి ప్రేమగా చూడసాగారు. 'ఆ క్షణంలో నన్ను నేను మరచిపోయినాను. ఏమని చర్ణించను? నాలోని ఆత్మ ఉన్నత శిఖరాన్ని చేరినట్లు అనిపించింది. అప్పుడు భగవాన్ మందహాసం చేశారు. అప్పటి ఆనందం నేను జన్మలో మరచిపోలేను. ఆ ఒక్క క్షణం చాలు. అప్పుడు వచ్చిన మార్పు జీవితాంతం సరిపోతుంది. '

అమెరికా తిరిగి వెళ్లిన తర్వాత ఆమె కొన్ని ప్రశ్నలు భగవాన్ కి పంపింది. మరొక అమెరికన్ భక్తుడు తెచ్చి భగవాన్ కిచ్చాడు. ఆయన పేరు గేహగ్స్. గేహగ్స్ కొంతకాలంగా ఆశ్రమవాసి. ఆమె పంపిన ప్రశ్నలు పునర్జన్మలు, గతం, భవిష్యత్తుకు సంబంధించినవి.

'పునర్జన్మ వాస్తవమా! నిజంగానే పునర్జన్మ ఉంటుందా?'

'ఇప్పటి జన్మ వాస్తవం అయితే, పునర్జన్మ వాస్తవమే.
ఇంతకుముందు జన్మించి ఉండటం నిజమైతే, మళ్లీ జన్మించడమూ నిజమే అవుతుంది. '

'మరణం అంటే ఏమిటి ? పుట్టడం అంటే ఏమిటి? ఎందుకు?'
'శరీరానికి పుట్టడం, చావడం రెండూ తప్పనిసరి పనులు. '

'మరణానికి , మరొక జన్మకు రావడానికి మధ్య విరామం ఎంత?'
'ఒక్కొక్కరు ఒక ఏడాదిలోపే జన్మిస్తారు లేదా మూడు సంవత్సరాలు పట్టవచ్చు. లేదూ , వేల సంవత్సరాలు పట్టవచ్చు. అయినా కాలాన్ని కొలవడం ఎలా? శూన్యానికి విరామం ఏమిటి? అసలు కాలం అంటేనే శూన్యం కదా.'

'మనిషికి గత జన్మల జ్ఞానం ఉండదు. ఎందుచేత?'
'గతించిన వన్నీ భ్రమలు. కరిగిపోయిన కలలు. వాటి జ్ఞాపకాలతో ఏంపని? నీవు ఒకసారి ఆత్మలోకి ప్రస్థానిస్తే గతంతో పనిలేదు. భవిష్యత్తు అవసరం ఉండదు. నిజానికి వర్తమానం సైతం శూన్యమై పోతుంది. ఏమీ మిగలదు. ఆత్మ కాలాతీతం. కాలరహితం. '

'యీ శరీరాన్ని వదిలిన ఆత్మ వెంటనే మరొక శరీరాన్ని ఆశ్రయిస్తుందా ?'
'శరీరం ఆధారం లేకుండా 'జీవి' ఉండదు.'

'ఎటువంటి శరీరాన్ని కోరుకుంటుంది?'
'అది యే రూపాన్నయినా తీసుకోవచ్చు. సూక్ష్మ శరీరం కావచ్చు. స్థూల శరీరం కావచ్చు.
ఆత్మకు ఏదో ఒక శరీరం ఆధారంగా ఉండాలి. '

'స్థూలం అంటే భౌతిక శరీరం అనే కదా! అదే మనకు తెలుస్తుంది? '
'ఆ తేడా నీకు అర్థం కావడానికి మత్రమే. జ్ఞానికి శరీరాల తేడా ఉండదు. '

'మరల జన్మించడానికి కారణం ఏమిటి?'
'తీరని కోరికలు, నెరవేరని ఆశయాలు, కోరికలు తీర్చుకోవాలన్న తపనతో మళ్లీ జన్మిస్తారు. ప్రతి శరీరానికి ప్రతిజన్మలో తీరని కోరికలు కొన్ని మిగిలి ఉంటాయి. కొన్ని కొత్తగా ఏర్పడుతుంటాయి. అందుచేతనే మనిషి మళ్లీ మళ్లీ జన్మించడం జరుగుతోంది.'

యీ జవాబుల చివరగా భగవాన్ ఒక సందేశం లాగ యిచ్చారు.

'నీ ప్రశ్నలు మంచివే. బావున్నాయి. డి. అకోస్తాతో చెప్పు. అతిగా ఆలోచించవద్దని. ధ్యానం చేసుకుంటూ ఆలోచనల్ని దూరం చేసుకోమను. చాలు. మనస్సు 'ఆత్మ'లో లయిస్తే ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మపరులు హృదయ గుహలో విశ్రమించడం నేర్చుకోవాలి. ఆ పని సహజంగా జరుగుతుంది. జరగాలి. అప్పుడు యీ ప్రశ్నలేవీ మిగలవు. ప్రశ్నించే అవసరం ఉండదు. అలా స్థిమితంగా ఉండడం 'అకర్మణత్వం' కాదు. మౌనంగా, నిశ్చబ్దంగా, ప్రశాంతంగా ఉండడం ఒక్కటే నిజమైన పని.

జబ్బు నయం చెయ్యమని ఆయన కూతురు భగవాన్ని ప్రార్థిస్తూ

Friday, June 19, 2009
భగవాన్ భక్తుడు మహాదేవయ్యర్ ఓ నెల రోజుల నుంచి మద్రాసులో ఎక్కిళ్ళతో బాధపడుతున్నారు. ఆ జబ్బు నయం చెయ్యమని ఆయన కూతురు భగవాన్ని ప్రార్థిస్తూ ఉత్తరం రాసింది. బెల్లమూ, శొంటి పొడుం నూరి తింటే ఎక్కిళ్ళు నయమౌతాయని రాయమని, మాధవస్వామి (పరిచారకుడు) వేపు తిరిగి . . . 'తయారు చేసిన మందు మన దగ్గిర వుండాలి కదూ!' అని అడిగారు. మాధవస్వామి ఆ బుడ్డి తీసుకొచ్చాడు.

దాన్ని కొంచెం భగవాన్ తీసుకొని భక్తులకి కొంచెం పంచిపెట్టారు.
అది చూసి సుందరేశయ్యర్ అనే భక్తుడు 'ఇంకా ఉత్తరం కూడా ఎందుకు? మహాదేవయ్యర్ కి యీ పాటికి ఎక్కిళ్ళు నయమై వుంటాయి ' అని. ఆ సాయంత్రమే ఉత్తరం రాశాను. కాని ఆ ఉత్తరం అందకుండానే, మర్నాటికే ఉత్తరం వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నించి అయ్యర్ గారికి ఎక్కిళ్ళు కట్టాయి అని.

సరిగా అదే సమయానికి భగవాన్ మందు తిన్నది.

నా మనసు నేను చెప్పినట్టు వినక దాని ఇష్టం వచ్చినట్టు . . .

ఒకసారి పాతూరి లక్ష్మీనారాయణ భగవాన్ ని అడిగాడు
'భవవాన్! నా మనసు నేను చెప్పినట్టు వినక దాని ఇష్టం వచ్చినట్టు విహరిస్తోంది.
అందువల్ల నాకు అశాంతి కలుగుతోంది. నా మనసు స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు మార్గం ఏది?'.
ఆ ప్రశ్నకు భగవాన్ కరుణారసమైన వాక్కుతో , స్పష్టంగా తెలుగు భాషలో ఇలా అన్నారు.

'జీవితంలో సాధకుల యత్నమంతా అందుకోసమే.
ఆ మనసుని అరికట్టడానికే జ్ఞాన, భక్తి, కర్మ మార్గములన్నీ దానికోసమే.

జ్ఞాన మార్గం ద్వారా మనసును నేను కాను అని తెలుసుకుని మనసుని నిరోధించవచ్చును.

కర్మ మార్గములో ఏదో ఒక కర్మయందు మనసుని లగ్నం చెయ్యడంవల్ల, మనసు నిలిచి పోతుంది.

భక్తి మార్గంలో మనసుని సర్వదా ఇష్టదైవం మీదికి పోనిచ్చి, ఆ ప్రార్థన పూజ సేవలలో మనసుని వుంచడంవల్ల, కొంతకాలానికి ఆ మూర్తియందే లగ్నమై నిలబడిపోతుంది.

అన్ని మార్గాలలో భక్తి మార్గం సులభం.
నీ ఇష్టదైవం పటంగాని, విగ్రహం గాని, నీ మనసులో తీరిక ఐనప్పుడల్లా ధ్యానించుకో.
దానివల్ల నీ మనసు నిలబడిపోతుంది.

ఎవరికన్నా వొళ్ళు బాగాలేకపోతే, వంటలో మార్పుతోనే . . .

Wednesday, June 17, 2009
ఒక భక్తురాలు సంపూర్ణమ్మ అనుభవాల్లోంచి -

నాకు వంట అంత చేతకాదు. పైగా మా వంట విధం వేరు, ఆశ్రమం వంట వేరు. భగవాన్ నా పక్కన వుండి ఎట్లా అవీ తయారుచెయ్యాలో వోపికతో నేర్పారు. ఆ పూటకి ఏమేమి తయారు చెయ్యాలో ఆయనయే చెప్పడం, ఆ పదర్ధాలు ఎట్లా తయారుచెయ్యాలో కూడా ప్రతి చిన్న విషయం చెప్పడమును. 'ఇదేమిటి? యీ వంట? ' అని చాలా నవ్వుగా వుండేది నాకు.

అల్లం, మెంతులు, వాము, మిరియాలు, ధనియాలు, ఇంగువ - ఇవన్నీ ఎక్కువ వాడిక ఆశ్రమంలో. ఎవరికన్నా వొళ్ళు బాగాలేకపోతే, వంటలో మార్పుతోనే ఆ జబ్బు నయం చేసేవారు భగవాన్. ఏ పదార్థం ఏ కూర ఐనాసరే - బాగా రుబ్బినా, వొండినా, దాంట్లో దోషం పోతుందనేవారు. వొళ్ళు బాగా లేనివారికి పనసకాయని చూస్తే భయం. భగవాన్ ఆ పనసకాయని చెక్కులుతో సహా రుబ్బించి, వొండించింతరువాత అది ఏ అనారోగ్యమూ చేసేది కాదు. భగవాన్ వంటింటి మధ్య వుండేవారు. ఏది కావలసి ఏది అందుకోడానికి వెళ్ళీనా, ఆయనకి ప్రదక్షిణం తప్పదు. ఆయనకు ప్రదక్షిణం చేస్తో వొండుతున్నాననే వుండేది నా మనసులో. కూర, పచ్చడి, సాంబారు ఏదైనా సరే - తయారుకాగానే తాను రుచి చూసే వారు, నాకు రుచి చూపే వారు. నేను వారి చేతికిచ్చిందాంట్లో వారు రుచి కోసం కొంచెం నోట్లో వేసుకుని, తక్కింది వంటలోనే వేసేవారు. దాంతో వంట అంతా ఆయన ప్రసాదమయేది.

అటువెళ్ళి, ఇటు వొచ్చి, వొంటింట్లోనే ఆయన పని. ఎన్నడూ ఏమీ ఆఖ్ఖర్లేనివారు, వంటింట్లోకి వొచి కొంచెం చారు తాగేవారు. తనకి చాలా ఇష్టమైనటు మజ్జిగ పులుసు చేస్తున్నారూ, ఆయనకి సంతోషం - పండగనాడు అన్నీ వొండుతూ వుంటే చూస్తున్న చిన్నపిల్లల సంతోషం. ఏది ఎట్లా రుబ్బాలో, ఎపుడు వెయ్యాలో, ఎంత వుడికించాలో - ఎంత శ్రద్దో ! ఎంతో జాగర్త, ఏదీ లోపం జరగకూడదు.

ఇంకోసారి 'ఎచ్చెమ్మ ఏది చేసినా, నిప్పుకి చూపి, వుడికిందనుకుని స్వామికి పంపుతుంది . వేణమ్మ ఒక్క రవ్వ నిప్పు పైన పెట్టి దించుతుంది. యీ సంగతి వాళ్ళతో చెబితే నాలిక పీక్కుంటారు. కాని, వాళ్ళు ప్రసాదమని నాకు పెట్టినవన్నీ తినాలి. నా ఖర్మం అట్లా అయింది. ఏం చెయ్యను?' అన్నారు. కానీ, ఎచ్చెమ్మపాటి నుంచి ప్రసాదం రాకపోతే, వొచ్చిందాకా భోజనాలు ఆపించేసేవారు ఆశ్రమంలో.

ఏదీ వృధా కాకూడదు, ఒక్క బియ్యపు గింజ, ఆవగింజ కింద పడి వుంటే వొంగి ఏరి తీసి, బుట్టల్లో పడేస్తారు. పచ్చి కరక్కాయల ఊరగాయి, నల్లేరు పచ్చడి, చివరికి వేపాకు కనబడ్డా వంటలో వేయించేవారు. కాని, ఏదీ వెగటివ్వదు. ఏం వేశారో ఎవరూ తెలుసుకోలేరు.

మహాత్మాగాంధీ | భగవాన్

1938 లో మహాత్మాగాంధీ ప్రతినిధిగా బాబూ రాజేంద్రప్రసాద్ రమణాశ్రమం వచ్చి మూడు రోజులు గడిపాడు. ఆయనకు తోడుగా జమునాలాల్ బజాజ్ వచ్చారు. బజాజ్ భగవాన్ ని కొన్ని ప్రశ్నలడిగారు.

'యీ పోరాటంతో స్వరాజ్యం సంపాదించగలిగితే అది ఎవరికైనా ఆనందదాయకమే గదా భగవాన్ ! '

'త్యాగం ఒక్కటే చాలదు. త్యాగం వెనుక శరణాగతి వుండాలి . భగవదేచ్చను ఆమోదించాలి. అప్పుడే సత్ఫలితం. ఆ విషయం ఆయన (మహాత్మాగాంధీ) మరువకూడదు. అప్పుడు ఆనందపడవలసింది ఏముంటుంది? ఫలితం ఆశించకుండా కర్తవ్యం నెరవేర్చడం ముఖ్యం. దానిని నిష్కామయోగం అంటారు.'

'భక్తుల్ని అనుగ్రహించే శక్తి భూమిపైన ఎవరికీ లేదంటారా? మీవంటి మహర్షులు స్వరాజ్యం సంపాదించవచ్చుగదా? మన ప్రాచీన మహర్షుల తపస్సు ఇపటికీ పనికొస్తుందా? దానిని మనం ఉపయోగించుకోగలమా? '

'ఉపకరిస్తుంది. అది ఏ ఒక్కరి సొత్తు కాదు. మనుషులలో చైతన్యం కలగడానికి వారి తపోశక్తి పనికొస్తుంది. ' ఆ
ఇద్దరి సంభాషణ బాబూ రాజేంద్రప్రసాద్ మౌనంగా ఉండి విన్నారు.

చివరకు 'మహాత్మాగాంధీ నన్ను తమ దర్శనానికి పంపారు. మీ సందేశం?'

'ఏం సందేశం కావాలి? హృదయాలు పరస్పరం పలకరించుకుంటున్నాయి.
అది చాలు. ఇక్కడ శక్తి అక్కడ తనలోనూ పని చేస్తోంది .'

స్వామికి ఒక్క నమస్కారం పెడితే సరిపోతుంది ?!

Thursday, June 11, 2009
వొక భక్తురాలు వారణాసి సుబ్బలక్షమ్మ మాటల్లో -

మొదటి నుంచీ కూడా భగవాన్ వాకిట్లోకి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ నేను ఆయనని చూడగానే లేచి నుంచుంటో వుండేదాన్ని. ఆయన చూస్తోనే వుండేవారు. ఆయన మా ఎదురుగా వస్తే చాలు - అందరం కూడా భయ భక్తులతో ఒక పక్కకి ఒదిగి వుండేవాళ్ళం. నేను వూళ్ళో కాపురం వుండి ఆయన దర్శనార్థం వొచ్చేకాలంలో నేను వచ్చినప్పుడల్లా కొంచెం ద్రాక్షపళ్ళు కొని తీసుకొని వచ్చి ఆయనకిచ్చే అలవాటు. ఒక సాయంత్రం అదే ప్రకారం తెచ్చిన ద్రాక్షపళ్ళను ఆయన ముందు పెట్టాను. దానిని చూసి,

'ఇప్పుడెందుకు తెచ్చావు? ' అని నవ్వి, 'ఎప్పుడు తెచ్చావు ఇవి? పొద్దున తెచ్చావా, వొచ్చేటప్పుడు? అయితే, యివి ఇప్పుడెందుకు పెట్టావు? ' అని నన్నూ - అందర్నీ కలిపి - 'ఇదంతా ఎందుకు? స్వామిని చూసి నుంచునేదీ, చాలా భక్తి వున్నట్టు నటించేదీ, యీ వేషాలన్నీ ఇక్కడికి వచ్చిన తరువాత యిది నేర్చుకున్నది. ఇవన్నీ యెందుకు ? వీటివల్ల ఏం ఫలం? మామూలుగా వుంటే చాలదా? మనసు నిర్మలంగా వుండాలిగాని; యీ నమస్కారాలూ, మన్ననలూ - యివన్నీ వేషం. స్వామి కన్ను తుడిచి ఏమార్చాలని చూసే పనులు ' అని మురుగునారుతో అన్నారు.

యింకా యిలా అన్నారు
'యీ నమస్కారాలు అన్నీ యేం ప్రయోజనం? మొదట మనుషులు ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తి వినయాలతో వస్తారు. తరువాత త్వరలోనే సర్వమూ వారిదే. అంతా వారి ఇష్టమే. అధికారమే. వారు చెప్పినట్లు స్వామి వినాలి. స్వామిది యేదీ లేదు. వారు యెన్ని తప్పులు చేసినా వూరికే నోరుమూసుకు వుండవలసిందే స్వామి.

వారు ఒక్క నమస్కారం చేశారా, అర్థం ఏమిటంటే - మేము నమస్కారం పెట్టాం గదా, మా తప్పులకీ ఇక మీరు ఏమీ అనడానికి వీలులేదు అని ' ఇట్లా చాలా కోప్పడ్డారు.

భగవాన్! నా కొడుకుని బతికించండి

Wednesday, June 10, 2009
రేపల్లె దగ్గిర మూరతోట గ్రామం నించి వొక శవాన్ని పెట్టెలో పెట్టి తీసుకొచ్చారు, ఆశ్రమం గుమ్మంలోకి, ఒకరు రాత్రి ఎనిమిదింటికి. వాళ్ళకి ఒక్కడే కొడుకు. అతని భగవాన్ బతికిస్తారని ఆశ. ఆ తల్లి రాత్రి పదింటివరకు భగవాన్ తో చెప్పుకుంది.

భగవాన్ ఏమీ మాట్లాడలేదు.
వాళ్ళు వూళ్ళోకి వెళ్ళారు. తెల్లారిందాకా చూసినట్టున్నారు. తెల్లారి దహనసంస్కారాలు చేశారు.

తరువాత భగవాన్ అన్నారు, 'విశ్వాసంతో చాలా దూరం వొచ్చారు. కాని ఒకర్ని బతికిస్తే ఇంక యీ బతికించడానికి అంతం వుంటుందా? ' అని.

తరువాత రెండు రోజులున్నారు వాళ్ళు . వెళ్ళేటప్పుడు దుఃఖమంతా మరిచి నవ్వుతో వెళ్ళారు.

భగవాన్, మేము మీ దేహారోగ్యం కోసం అర్చన చేయించాం. ప్రసాదం తీసుకోండి

భగవాన్ కి కురుపు లేచి ఆపరేషను అవుతున్నపుడు ఓసారి వారికి ఎట్లాగో నయం చెయ్యాలనే ఆదుర్దాలో, రాజయ్యార్ అనే భక్తుడికి పని నేర్పిన ఓ పోస్టుమాష్టరుగారూ , రాజయ్యార్ , తంజావూరు దగ్గిర ప్రసిద్దికెక్కిన పచ్చయమ్మ దేవాలయానికి డబ్బు పంపి, అర్చనలు చేయించి ప్రసాదం తెప్పించారు. ఆ ప్రసాదం భగవాన్ కి అందివ్వాలి , అప్పటికి భగవాన్ దగ్గిరకి పోగూడదు, భగవాన్ తో మాట్లాడకూడదనే నిబంధనలు తీవ్రంగా ఉన్నాయి. ఎవరన్నా భగవాన్ దగ్గిరకు వెళ్ళడం ఆశ్రమ పెద్దలు చూశారా ఆశ్రమం బయటికి తరుముతారు. అందుకని భగవాన్ని ప్రార్థించుకుంటో, సహాయం కోసం చూస్తున్నారు. మధ్యాహ్నం రెండ్గంటలకి ఎవరూ లేరు.

వీళ్ళిద్దరూ పిల్లుల మల్లే లోపల దూరి,'భగవాన్, మేము మీ దేహారోగ్యం కోసం పచ్చయమ్మకి అర్చన చేయించాం. ఆ ప్రసాదం మీకు తీసుకొచ్చాం ' అన్నారు, ఏం కోప్పడతారనే భయంతోనే. కాని, వారు వారి హృదయంలోని భక్తి శ్రద్దల్ని మాత్రమే గమనించి వుంటారు. కాకపోతే, సర్వేశ్వరుడికి జబ్బు చేస్తే, పచ్చయమ్మ ప్రసాదం నయం చేస్తుందా? అయినా , భగవాన్ ఆ విభూతి కుంకుమలని చాలా ఆదరంతో తీసుకుని, మొహాన పెట్టుకుని, వొంటికి రాసుకుని, ఆ కురుపు మీద కూడా నెమ్మదిగా రుద్దుకున్నారు. పచ్చయమ్మ మహత్యం గురించి మాట్లాడారు. భక్తులిదరూ ఎంతో తృప్తి పడి సంతోషంతో వొచ్చేశారు.

ఏ విధాన, ఏ తాహతుతో, ఎట్లా ఏ భక్తుడు అయనని సమీపిస్తే
ఆ విధంగా వారి అంతస్తులోనే తృప్తినీ, ప్రీతినీ కలిగించేవారు.

రైలుకి టైమవుతోంది! వూ ! తొందరగా మోక్షాన్ని పొందేటట్టు ఉపదేశించండి

ఒకసారి కుంభకోణం నిండి యిద్దరు స్త్రీలు వచ్చారు. వాళ్లలో ఒకామె గురువు, ఇంకో ఏమె శిష్యురాలు వాళ్ళే భోజనం వండుకొని, దాంట్లో సగం భగవాన్ కి ప్రసాదం కింద అర్పించారు. ఆ సాయంత్రమే రైలుకి వెళ్ళాలన్నారు. గురువును భగవాన్ హాలులోకి తీసుకుని వచ్చి ఓ చోట భక్తిగా కూచోపెట్టింది శిష్యురాలు. తానూ కూచుంది. ఉండుండి శిష్యురాలు

భగవాన్ తో ' ఆమె ఉందే అంతా , మీ రకమే ' అనీ,
ఇంకోసారి 'ఆమెదీ అంతా మీ స్థితే ' అనీ -
అట్లా అంటో 'తమ ఆశీర్వచనం కావాలి మాకు ' అంది మళ్ళీ.
'శీఘ్రంగా మోక్షం అందుకోకలిగేట్టు ఏదన్నా ఉపదేశించండి.' అంది.

ఆ మాటలకి దేనికీ భగవాన్ పలకలేదు.

'ఏదో అంటారు. మమకారం అంటారు. మాయ పోవాలంటారు. కనుక భగవాన్ మాకేమన్నా ఉపదేశిస్తే బాగుంటుంది.' అంది. మధ్యాహం దాటుతోంది. ఆమెకి తొందర పుట్టింది.

'వూ, కానీయండి మరి - టైమవుతోంది ' అంది,
మళ్ళీ 'కానీండి, ఉపదేశించండి. మేము రైలుకి వెళ్ళాలి ' అంది.
'మేము రైలుకి వెళ్ళాలి, కానీండి ' . ఇట్లా హెచ్చరిక లాగు చేస్తోంది.

స్వామి ఏం మాట్లాడలేదు.
చివరికి కొంచెం తగ్గి 'స్వామీ ! ఆమెకి ఏదన్నా చెప్పండి. అజ్ఞానం అంటారు - అదేమిటో కొంచెం ఉపదేశించండి. ఆ అజ్ఞానం అదీ ఏమిటో కొంచెం వివరించండి. మేము వెళ్ళాలి, రైలు టైమయింది ' అంది.

భగవాన్ ఏమీ కోపించకుండా మురుగనార్ తో 'అజ్ఞానం ఎవరికో అది తెలిసికోమనండి ' అన్నారు.
'మీకు కావలసిన ఉపదేశం అయింది . ఇంక మీరు రైలుకి వెళ్ళవచ్చును ' అన్నారు మురుగనార్.

వాళ్ళు వెళ్ళాక భగవాన్ అన్నారు. 'తొందర, ఆలస్యమవుతూంది రైలుకి, వెళ్ళీతీరాలి. వీలైతే ఆ కాసేపట్లో శీఘ్రంగా మోక్షాన్నీ వెంట తీసుకొని వెళ్ళాలి స్వామినుండి. మోక్షమేమన్నా అంగట్లో దొరుకుతుందా? అవీ, ఇవీ పుస్తకాల్లో అర్థం కానివన్నీ చదివి పండితులమైనామనుకుంటున్నారు ' అన్నారు.

వాటిని నువ్వు కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి

Saturday, June 6, 2009
ఆశ్రమంలో వుండే యింకో భక్తుడు కృష్ణస్వామి కోతుల్ని ఒక్కటే కొట్టేవాడు ఎప్పుడూ. కోతులు హాలులోకి వచ్చి అల్లరి చేసినా, పళ్ళు ఎత్తుకుపోయినా, ఏమి చేసినా, కొట్టేటప్పుడు కొట్టవద్దనేవారు భగవాన్.

ఒకసారి అతను కోతుల్ని కొడుతూ వుంటే,

'నువ్వు కోతుల్ని కాదు, నన్నుకొడుతున్నావు.
వాటిని నువ్వు కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి.
ఆ బాధంతా నేను పడుతున్నాను ' అన్నారు భగవాన్.

ఆమె భగవాన్ వేపు కాళ్ళు జాపి కూర్చుంది

Friday, June 5, 2009
కొత్తగా యూరపు నించి ఒకామె వచ్చింది. ఆమెకు కాళ్ళు ముడుచుకొని కూచోటం చాలా కష్టం. కాళ్ళు చాచింది కొంతసేపటికి. అవి భగవాన్ వేపుకు వున్నాయి. భగవాన్ వెంట నుండి సేవచేసే అనుచరుడు మండిపడి '

సరిగా కాళ్ళు ముడుచుకొని కూచో' మని ఆజ్ఞాపించాడు.
ఆమె ముడుచుకుంది భయంతో.

వెనక్కి ఆనుకొని కాళ్ళు చాచుకొని కూచున్న భగవాన్ వెంటనే ఆమె మల్లేనే తానూ కాళ్ళు ముడుచుకొని కూచున్నారు. అంతే, ఎన్ని గంటలైనా అట్లానే కూచున్నారు. భగవాన్ కాళ్ళు అసలే నెప్పులు. చాలాసేపు ఒకే భంగిమలో కూచోలేరు. అందరూ ప్రార్థించారు. ఆయన్ని కాళ్ళు జాపుకోమని.

'హాలులో అందరికి ఒకటే మాట.
ఎన్నడూ ముడుచుకుని కూచోని ఆమెకు ఆజ్ఞ పెడితే నాకు పెట్టినట్లు కాదా?' అని,
ఆ రోజంతా అట్లానే కూచున్నారు.

ఏదో పిశాచం గావునని మరీ భయం వేసింది !

ఒకసారి రమణ భక్తులు సంపూర్ణమ్మా, సుబ్బలక్షమ్మా గిరి ప్రదక్షిణం బయలుదేరారు తెల్లారకట్టే. బాగా చీకటిగా వుంది. వుంది. ఎట్లా వెళ్ళాడం. వెళ్ళాలా ?లేదా?తోవలో పాములున్నాయేమో? కనబడవే అనుకున్నారు. ఇంతలో వారి ముందు తోవలో యేదో నీలం రంగు వెలుతురు పడ్డట్టు అయింది. ఏదో పిశాచం గావునని మరీ భయం వేసింది. కాని, చూస్తే ఆ వెలుతురు వల్ల ధైర్యం వొస్తోంది గాని, భయం కలగటం లేదు.

వాళ్ళ వెంటనే వొచ్చింది ఆ వెలుతురు -
పగటి వెలుతురు వొచ్చి వాళ్ళ భయాలు పోయిందాకా తోవ చూపుతో.

ఇంకోసారి వాళ్ళిద్దరూ కొండ చుడుతున్నారు, పొద్దున్న ఎనిమిదిగంటలకి, కబుర్లు చెప్పుకుంటో. రోడ్డు నిర్జనంగా వుంది. వాళ్ళ వెనక ఎవరో సామియార్ వొస్తున్నారు. ఇద్దరూ వయసులోవున్న ఆడవాళ్ళూ. ఇంకా అడవిలోకి పోయాం వెనక యీ పురుషుడెందుకని , ఆయనని ముందు పోనిద్దామని ఆగారు . ఆ సామియార్ ఆగారు. సంపూర్ణమ్మకు అనుమానమేసింది. మళ్ళీ నడిచారు. ఆయనా నడిచారు. మళ్ళీ ఆగారు. ఆయనా ఆగారు. ఇట్లా మూడు నాల్గుసార్లయ్యేటప్పటికి వాళ్ళకి భయం వేసింది. రోడ్డు మీద ముందూ వెనకా ఇంకేం మనుషులు కనపడరు. ఎట్లాగా అని - 'అరుణాచలేశ్వరా, నువ్వే ఎల్లకాలాలందూ శరణ్యం ' అని బిగ్గరగానే అన్నారు .

దానికి ఆ సామియార్
'అవును. అరుణాచలేశ్వరుడే సదా శరణ్యం. ఎప్పుడూ అట్లాగే తలుచుకోండి.
చూడండి, ఆ జ్యోతే లోకాన్నంతా తేజస్సుతో నింపుతోంది ' అన్నారు.
వారి వెంటనే వొస్తున్నారు.

కొంత దూరం వెళ్ళాక వెనక్కి చూస్తే ఆయన లేరు.
అన్ని దిక్కులా పరిశీలించి చూశారు.
దగ్గిర పొదల్లాంటివి, గుబురు చెట్లు లాంటివేమి లేవు,
అంతా , కనుచూపుమేర కనబడేంత విశాలంగా వుంది.

నన్ను శూద్రులు తాకేరు . మీరు నన్ను తాకితే ఆ దోషం పోతుంది!

Thursday, June 4, 2009
ఒకసారి ఓ కొత్తవాడు ఆశ్రమానికి వచ్చి ఓ గంగాళంలో నీళ్ళువుంటే, కొంచెం ముంచుకోపోయినారు. ఆశ్రమంలో ముఖ్యులుగా వుండే ఒకామె ఉగ్రంతో మీదికి దూకి 'ఎవరు నువ్వు? ఎవరి నీళ్ళనుకున్నావు?' అంటో తోసెయ్యటానికి సిద్దపడింది. ఆచారం పోలేదు సరే, ఆగ్రహం కూడా పోలేదు ఆమెకు.

ఆమెగారే, బ్రాహ్మలు కానివారు తనని తాకి నమస్కరించినా సరే ఆ పాపం ఆ మైల పోవడానికి వెళ్ళి భగవాన్ని తాకేది. భగవాన్ చుట్టూ వందలాది ప్రజలు చేరింతరువాత ఆయన్ని తాకడం సులభం కాకుండా పోయింది. ఒక జయంతికి వొచ్చిన గుంపులో ఎవరో పోతూ ఆమెగారికి తగిలారట.

ఆమె వెళ్ళి భగవాన్ ముందు నుంచుంది.
'భగవాన్ ! నన్ను శూద్రులు తాకేరు .
మీరు నన్ను తాకితే ఆ దోషం పోతుంది.'

'ఫో ! నేను తాకను ' అన్నారు భగవాన్

భగవాన్ సమక్షంలో సామాన్యురాలు

ఎవరికన్నా తనకి అధికంగా ఏమి ఇచ్చినా భగవాన్ ఏ మాత్రం సహించేవారు కారు. తనని వొదిలి, వారికే ఎక్కువగా శ్రద్ద చూపమనేవారు. తనకి ఏవి ఎవరు సమర్పించినా, తనకి వొళ్ళు బావుండనప్పుడు కూడా వాటిని ముందు అందరికీ పంచవలసిందే. తనని, తన భక్తులలో చూడమనేవారు.

ఒకసారి, కొన్నాళ్ళనించి భగవాన్ భోజనంలో మజ్జిగ పోసుకోవటంలేదని గమనించారు వొడ్డించేవారు. భగవాన్ కి దగ్గిరగా కూచొని భోజనం చేసే దేవరాజ మొదలియార్ భరించలేక,

'భగవాన్! మేమందరమూ అన్నీ సమృద్దిగా తింటున్నాం. ప్రతి భోజనం లోనూ మీరేమో ఎప్పుడూను ఏదో ఒకటి సరిగా వెయ్యనీక వొదిలేసి భోజనం చేస్తూ వుంటారు, చూస్తూ చూస్తూ మేమెట్లా తినగలం? ' అని అడిగాడు.

దానికి భగవాన్ -
'భగవాన్ కి ఏం తక్కువ? భగవాన్ కి ఇష్టం వుండినా వుండకపోయినా, వూరికే ఇంతింత పోస్తారు. భగవాన్ భక్తులకూ పొయ్యాలంటే మాత్రం చేతులు రావు ' అన్నారు.

పని చేసేవారిని కనుక్కుంటే అసలు సంగతి తెలిసింది. బెంగుళూరునించి ఒక అమ్మాయి ఆశ్రమానికి వొచ్చింది. ఆమె భోజనం చేస్తో ఇంకొంచెం చారు అడిగింది. ఆ సమయాన మజ్జిగ పోస్తున్నారు. వొడ్డించేవారు ఆ అమ్మాయి అడిగింది వినీ లక్ష్యం చేయక, ఆమె తింటున్న చారు అన్నంలోకి మజ్జిగ పోసేశారు. ఆ ఒక్క సంగతే కాదు, వొడ్డించేవారికి తినేవారిపైన అశ్రద్దే కాదు, తృణీకారం కూడా వుండేది. భగవాన్ కి ముఖ్యులమనుకునే భగవాన్ సమీపవర్తులకి, సంపన్నులకీ శ్రద్దగా వొడ్డించి - కొత్తగా వొచ్చినవారికి, సామాన్యులకి, భగవాన్ దూరంగా భోజనానికి కూచున్నవారికి నిర్లక్ష్యంగా వొడ్డించేవారు. తనకోసం వచ్చిన భక్తుల్ని తనవలె చూడమని, సేవ చేయమని, భగవాన్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునేవారు కాదు. అందుకని, తనని నమ్మివున్న ఆ ఆశ్రమ సేవకులకోసం వారికి సత్ప్రవర్తనా, సమదృష్టీ నేర్పదానికి భగవానే తాను సరిగా తినేవారు కాదు.

నా బిడ్డ అంత చిన్న వయసులోనే ఎందుకు చనిపోయాడు ?

Wednesday, June 3, 2009
వొకరోజు బెంగాల్ నుంచి కొంత మంది వచ్చారు. ఇదివరకే వాళ్ళలో ఒకరు తమ బిడ్డను పోగొట్టుకుని వున్నారు. 'స్వామీ! నా బిడ్డ అంత చిన్న వయసులోనే ఎందుకు చనిపోయాడు. అది ఆ బిడ్డ కర్మ వల్లనా? లేక మేమనుభవించవలసిన కర్మ ఫలితాలేమైన మిగిలివున్నాయా?' .

'లేదు ! పిల్లవాడి ప్రారబ్దశేషం తీరిపోయింది. అది కర్మఫలితమే . మీ విషయానికొస్తే మీరింకెంతమాత్రమూ చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈశ్వరుడు తాను యిచ్చిన వాటిని తిరిగి తానే తీసుకున్నాడు కనుక.'

'అయితే స్వామీ ! పిల్లవాడు జీవించి వుండి అతనికంటే పెద్దవాళ్ళెవరైనా మనరణించి వుంటే వుంటే, యెవరెక్కువ పాపులు?'

భగవాన్ సమాధానం చెప్పలేదు. మౌనంగా యెటో చూస్తున్నారు.

'స్వామీ! ఒక వ్యక్తి యెక్కువ కాలం జీవించి వున్నాడంటే, తన మోక్షమార్గాన్ని సుగమం చేసుకోవటనికి యెక్కువ అవకాశాలు వున్నట్లే కద?''

'త్వరగా చనిఫోయినవాడు మళ్ళీ జన్మించి
తన ప్రారబ్ద శేషాన్ని పూర్తిచేయటానికే యెక్కువ వెసులుబాటుగా వుంటుంది.'

భగవాన్ ని ఈడ్చి ఒక లెంపకాయ కొట్టింది !

భగవాన్ కొండపైన ఉన్నప్పుడు ఆయన భోజనం చేస్తుండగా, ఓ పెద్ద కోతి వచ్చి విస్తరి పక్కన కూచుంది. భగవాన్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతూ, ఆ కోతిని చూసి ఆ ముద్దని దానికిచ్చేశారు. ఆ కోతి ఆ ముద్దని తినకుండా విస్తట్లో పెట్టేసి భగవాన్ ని యీడ్చి ఒక లెంపకాయ కొట్టింది.

'ఇదేమిటి, నీకే ముందు పెట్టాను కదా! నన్నెందుకు కొట్టావు ?' అని భగవాన్ అడిగారు.
'ఇతను కోతులకు రాజు. ఇతన్ని రాజుని గౌరవించినట్లు గౌరవించాలి ' అని
తనలో తాననుకున్నట్టుగా అని ఆ ప్రకారం అతనికి వేరే విస్తరి వేయించి వడ్డించారు.

అప్పుడు ఆ కోతి సంతోషంగా తిని వెళ్ళిపోయింది.

భక్తుడికి దర్శనం

Tuesday, June 2, 2009
భగవాన్ చివర రోజులు. ఆపరేషన్ చేసి, ఆయనను గదిలో పడుకోబెట్టి కదలకూడదనీ, ఎవ్వరూ ఆయనను డిస్టర్బ్ చేయకూడదనీ కావలి కూడా పెట్టారు ఆశ్రమంవారు . వొక రోజు మిట్ట మధ్యాహ్నం ఎక్కడ నుంచో ఒక సాధువు వచ్చి ఆశ్రమం గేటు దగ్గర ఒకరిని అడిగాడు, భగవాన్ ఎక్కడ అని. పరిస్థితి చెప్పి, భగవాన్ దర్శనాలు లేవని చెప్పారు. తాను వెంటనే వెళ్ళిపోవాలనీ, భగవాన్ దర్శనం అయితీరాలనీ అన్నాడా సాధువు. వీలులేదన్నారు ఆశ్రమంవారు.

యీ మాటలు భగవాన్ కి వినపడే ఆస్కారం లేదు.

సాధువు మాత్రం వెళ్ళిపోక అక్కడే నించుకొని కళ్ళు విప్పి భగవాన్ పడుకున్న గది వంకే చూస్తున్నారు. అంత దూరం నుంచి, సాధువు కళ్ళు వెడల్పుగా తెరుచుకున్నాయి.

గదిలోనుంచి వరండాలోకి వచ్చి
ఆయనకి దర్శనం యిస్తున్న భగవాన్ వైపు చూస్తున్నాయి ఆయన కళ్ళు.
అట్లానే ఒకరు నొకరు నాలుగు నిమిషాలు చూసుకున్నారు.
నిశ్చబ్దంగా, అంతే .

ఆ సాధువు వెళ్ళిపోయినారు.
భగవాన్ తన గదిలోకి వెళ్ళి పడుకొన్నారు.
మళ్ళీ ఆ సాధువు ఎన్నడూ కనపడలేదు.

ఆయన్ని తలుచుకుంటే ?

భగవాన్ కి జబ్బుగా వుంది. చివరి రోజులవి. దర్శనానికి వచిన వందలాది జనన్ని మధ్యాహ్నం నుంచి క్యూలో నడిపించి దూరమ్నుండి భగవాన్ దర్శనం చేయిస్తున్నారు.

ఆయన ఎవరి వంకా చూసేవారు కాదు.

తన వంక ప్రతిరోజు చూస్తారని చెప్పింది నర్తకి చలంతో.
'ఎట్లా?' అన్నాడు చలం ఆశ్చర్యంతో.

'ఏం లేదు! వెళ్ళేముందు మ్నసులో
'భగవాన్ ! నా వంక చూడండి అనుకుంటాను. చూస్తారు ' అన్నదామె.

బట్టలు లేని ఇద్దరు గొప్పవారు

Monday, June 1, 2009
మొదటిసారి గ్రీన్ లీస్ అనే ఆయన భగవాన్ దర్శనానికి వచ్చినప్పుడు ఒకరితో అంటున్నాడు.

'నా చెల్లెలు ఇంగ్లాండు నుండి వస్తానంటుంది.
ఆమెకు భగవాన్ గురించి, గాంధీగారిని గురించి చాలా రాశాను
యీ దేశంలోకల్లా ముందు చూడవలసిన వాళ్ళు వారిద్దరేనని. కాని తీరా వస్తే ఎట్లా చూపను?
ఇద్దరికి వొంటిమీద బట్టలు సరిగా వుండవు.
ఇద్దరూ అందం లేనివారు.
వీరిద్దరే గొప్పవారంటే ఏమంటుందో ఏమో?' అని.

భగవాన్ కరుణాప్రసారం

ఒక ఉదయం ఒక ముసలి తెలుగు అతను వొక గుడి దగ్గర గుమ్మంలో నుంచుని వున్నాడు. చలాన్ని చూసి మాట్లాడుతున్నాడు. అతను భగవాన్ కి దూరంగా ఆశ్రమంలో గంటల కొలది నుంచుని ఉండటం చూశాడు చలం .

రాత్రంతా ఇక్కడే పడుకొని వుంటాను ' అన్నాడు, మాటల సందర్భంలో.
'ఏమిటి, ఇక్కడా, వంటరిగానా, భయంలేదా?' అన్నాడు చలం.

'భయమా? ఏం భయం? రాత్రంతా నాపైన భగవాన్ కాంతి వేసి ఉంచుతారు,
నా చుట్టూ నీలం వెలుగు వుంటుంది.
ఆయన కాంతి నాతో వుంటే నాకేం భయం? ' అన్నాడతను.

గిరి ప్రదక్షిణంలో చిరుతపులి

పూర్వం ఒకసారి భక్తులు కొందరు అర్థరాత్రి వెన్నెలలో వేదం చదువుకుంటో గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. అడవిలో కొండమీద నుంచి ఒక చిరుతపులి దూకుతూ వచ్చి రోడ్డుమీద వాళ్ళ తోవకు అడ్డంగా నుంచుంది. వాళ్ళు హడిలిపోయినారు. నోట వేదం ఆగిపోయింది. వెనక్కి పరుగెత్తడానికి కాళ్ళు ఆడలేదు. ఆ చిరుతపులి అట్లాగే కొంచెంసేపు నుంచుని వాళ్ళకేసి కాస్సేపు చూసి తన తోవన వెళ్ళిపోయింది. మెల్లిగా నడుచుకొంటూ బతుకుజీవుడా అని వాళ్ళు ప్రదక్షిణం పని ముగించుకుకొని ఆశమానికి వచ్చి భగవాన్ తో చెప్పారు.

'ఎందుకు భయపడి వేదం చదవటం ఆపారు? వాడు ఒక జ్ఞాని.
మీ వేదం విని, ఇంకా దగ్గిరగా వినాలని ఆసక్తితో వచ్చాడు ' అన్నాడు భగవాన్.

ధ్యానంలో వూపిరి ఆగిపోయి

ఒకసారి చలం అడిగాడు

'ధ్యానంలో వూపిరి ఆగిపోయి ఉక్కిరి బిక్కిరై మెళుకువ వస్తుంది.
ఏం చెయ్యను, భగవాన్ ?'

దానికి భగవాన్,
'ఆ ఊపిరి పూర్తిగా ఆగిపోతే ఏ చిక్కూ ఉండదు. '
అని వేళాకోళం చేశారు. అందరూ నవ్వారు.

మనసు పరిపరి విధాల పోతోంది

Saturday, May 30, 2009
ఒకరోజు ఒకామె వచ్చి భగవాన్ దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు
'మనసు పరిపరి విధాల పోతోంది. ఏం చెయ్యను స్వామీ?' అని అడిగింది.

'ఒకే విధంగా పోయేట్టు చూడు ' అన్నారు.

ఆమె వెళ్ళాక రంగన్ అనే భక్తుడు అడిగాడు
'భగవాన్! అది చాతనైతే, ఇంకేం కావాలి? జ్ఞానమే కదా?'
'మరి ఏం చెయ్యను? రాగానే తాము జ్ఞానులై పోవాలని
ఆశపడతారు మనుషులు. చాలా సులభమనుకుంటారు.
దాంట్లో వుండే కష్టాన్ని గుర్తించరు ' అన్నారు భగవాన్.

జ్ఞాని

ఒకసారి ఓ భక్తుడు భగవాన్ ని అడిగాడు.
'ఓ జ్ఞాని ఇంకో జ్ఞానిని గుర్తించగలడా?'

దానికి భగవాన్
'జ్ఞానికి గుర్తించటానికి ఏముంటుంది?
తాను, తక్కిందీ అంతా ఒకటే ఆత్మ కదా జ్ఞానికి!' అన్నారు.

'భగవాన్ ! మీరు దేవుణ్ణి చూశారా ?'

Friday, May 29, 2009
ఒకరోజు సూటూ బూటూ వేసుకున్న పాశ్చాత్యుడు బూట్లు విడువకుండానే
భగవాన్ వున్న హాల్లోకి దర్జాగా వచ్చి

'భగవాన్! మీరు దేవుణ్ణి చూశారా ?' అని అడిగాడు.
భగవాన్ ఏమీ తెలీనివాని వలె, 'దేవుడా? ఎవరాయన ? ' అని అడిగారు.
అతను తెల్లబోయి నుంచున్నాడు. కొంచెం సేపుండి అతను

'భగవాన్ ! మీ ఫోటో నేను తీసుకోవచ్చునా ?' అని అడిగాడు.
సరేనన్నారు భగవాన్. ఆ వచ్చిన అతను ఒక snap తీసుకొని వెళ్ళాడు.

తరవాత భగవాన్ అన్నారు. 'వివేకానంద, రామకృష్ణుని 'దేవుణ్ణి చూశావా ' అని అడిగింది చదివి వుంటాడు. అదే అస్త్రం ప్రయోగించాడు. యీ వూరికి టిక్కెట్టుతో దేవుణ్ణి కొనుక్కోవాలని ప్రయత్నిస్తారు. ఏం చేస్తాం ? '

గీతా శ్లోకం పై భగవాన్

ఒకరోజు భగవాన్ భోజనానికి లేవబోతున్నారు. అప్పుడు ఒకరు -

'చాతుర్వర్ణం మయాసృష్టం
గుణకర్మ విభాగినః అని అంటారే!
అంటే గుణమునుబట్టి కదా వర్ణాన్ని తీర్మానించవలసింది? ' అని ప్రశ్న వేశారు. భ

గవాన్ కి తెలీదా? దేనికి ఆ ప్రశ్న lead చెయ్యబోతోందో.

'యీ ప్రశ్నలు తగూలూ తెచ్చిపెట్టడానికే కద! యీ దురుద్దేశాల వల్లనే అనర్థాలు పుట్టేది. నీ సంగతి నువ్వు చూసుకో. నిన్ను నువ్వు తెలుసుకోటానికి కులమూ, వర్ణమూ అడ్డం వొచ్చాయా? తానెవరో తెలీదు, నీకేం కావాలో తెలీదు, లోకానికేం కావాలో తెలుస్తుందా ? మీరా లోకాన్ని ఉద్దరించేవారు? ' అని మందలించారు.

రమణాశ్రమంలో హెచ్చుతగ్గులు

ఆశ్రమం పైన ఒక పెద్ద ఫిర్యాదు వుంటో వుండేది, గొప్పవారిని ఎక్కువగా చూస్తారని, ఒకాయన యీ హెచ్చుతగ్గుల సంగతి భగవాన్ తో చెప్పుకుంటో వుండగా భగవాన్ కి మధ్యాహ్నం కాఫీ వచ్చింది. మధ్యాహ్నాలు భగవాన్ హాలులో అందరి మధ్యా కూచుని వుండగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి

'చూడండి పోనీ, మీకిచ్చే కాఫీ శ్రేష్టమైంది. మా మొహాన్న నీళ్ళు ' అన్నాడు. భగవాన్ తాకకుండానే, తనకు వచ్చిన కాఫీ గ్లాసును మాట్లాడకుండా ఆయనకు ఇచ్చి, ఆయనకు వచ్చిన కాఫీని తాను తీసుకొని తాగుతున్నారు.

ఆయనకి భగవాన్ ఇచ్చింది కాఫీ కానేకాదు, ఏదో ఔషధులు వేసి కాచిన కషాయం. అది భగవాన్ తాగవలసిందే కాని తదితరులకు దుసాధ్యం. తీరా తీసున్నాడు . వద్దనడానికి వీల్లేదు. అందరి మధ్య వున్నాడు. పారపొయ్యటానికి వీల్లేదు. భగవాన్ ప్రసాదం, ఆయన చేత్తో ఇచ్చింది. ఆనాటి ఆయన యాతన ఆ భగవాన్ కే ఎరుక.

దారిలో చిరుతపులి

Thursday, May 28, 2009
ఒకసారి ఒక కుటుంబంతో ఓరుగంటి వెంకటకృష్ణయ్య అనే భక్తుడు రాత్రి గిరి (అరుణాచలం కొండ) ప్రదక్షిణం చేస్తున్నారు. ఈశాన్య మఠం వైపు మలుపు తిరుగుతుండగా మాకు ఓ లారీ ఎదురువచ్చింది. ఆ లారీవాళ్ళు 'జాగ్రత్తగా వెళ్ళండి , చిరుతపులుల అరుపులు వినబడుతో వున్నాయి. ' అన్నారు.

ఏం చెయ్యం? వెనక్కి వెళ్ళమా మళ్ళీ అన్ని మైళ్ళు? అడవిలో ఆగితే, అవి అక్కడికి రావా, మమ్మల్ని పసి గట్టి! తప్పదు ముందుకు పోవాలి. 'రమణా, జయ రమణా ' అని పాడుకుంటో వెళ్ళాం. ఊరు తగిలింది తరువాత చెప్పాడు మాతో వున్న కాలేజి అబ్బాయి, రోడ్డుకు ఇటు ఒక చిరుత, అటు ఒక చిరుత వున్నాయనీ, తాను చూసి కిక్కురు మనకుండా నడిచాననీ.

ధ్యానం

ఒకసారి భగవాన్ తో వొక భక్తుడు
'భగవాన్ ! ఇదివరకుమల్లే మీ రూపం
నా కళ్ళ ఎదుట నిలవటం లేదు. ఏం చెయ్యను? ' అని అడిగాడు.

'నామం జ్ఞాపకం వుంది కదా!
రూపం కన్నా నామం పై మెట్టు. నామమూ తరువాత పోతుంది.
అందాకా అది చాలు ' అన్నారు.

షౌ (చలం కూతురు ) స్పృతుల్లో భగవాన్

భగవాన్ చనిపోవడమనే Shock ని నేను భరించగలనా అని బాధ పడేదాన్ని చాలాసార్లు. కాని సరిగ్గా ఆ సమయానికి నేను అరుణాచలంలో వుండకపోవటం సంభవించింది. ఆయన మరణవార్తని విన్నప్పుడు నాలో ఏ చలనమూ కలగలేదు. నా indifference ని చూసి నాకే ఆశ్చర్యమేసింది. కాని వెంటనే ఇది ఆయన నామీద చూపించిన కరుణ అని తెలుసుకున్నాను. నేను మద్రాసులో వుండగా, నాన్న దగ్గిర్నించి ఉత్తరం వొచ్చింది - భగవాన్ సమాధి దగ్గిర, అసలు భగవాన్ జీవించి వునప్పటి కన్నా ఎక్కువ spiritual potency ని feel అవుతున్నానని.

నేను ఆశ్రమానికి తిరిగి వొచ్చినప్పుడు ఆశ్రమమంతా ఎడారి లాగుంది. వెంటనే భగవాన్ presence ని feel అయ్యాను. భగవాన్ కంటికి కనపడనంత మాత్రాన యీ భక్తులందరూ ఎందుకు ఆశ్రమాన్ని వొదిలిపోతున్నారా అని ఆశ్చర్యమేసింది నాకు. సమాధి దగ్గిర కళ్ళు మూసుకుని కూచోగానే భగవాన్ నవ్వుతున్న మొహం ప్రత్యక్షమయేది. కాని ఎంత స్పష్టంగా భగవాన్ని feel అవుతున్నా నా కళ్ళు ఆయన భౌతిక శరీరంకోసం వెతికేవి.

భగవాన్ స్మృతుల్లో చలం అంతర్మథనం | క్లుప్తంగా

I

యీ జగత్తుకీ జీవితానికీ ఓ అర్థం వుంటే, వీటి వెనక ఓ సత్యం వుంటే, పరస్పర విరుద్దమైన యీ విలువలకీ ఓ సమన్వయముంటే, దాన్ని తెలుసుకునే మార్గం లేదనీ, మానవుడి మనసుకి అంతశక్తి లేదు గనక,ఎంత తరిచి చూసినా, అది ఓ గుడ్డి వలయంలో తిరగడం తప్ప, ఇంకేమీ సాధింపలేదనీ నిశ్చయించుకున్నాను. కాని ఎప్పుడూ అన్వేషించడం మాత్రం మానుకోలేదు. ఎంత అర్థం లేకపోయినా సత్యాన్వేషణ అనేది నా జీవితానికి ఓ ప్రధాన లక్షణమై పోయింది. ఏదో నా మనసునీ ఆలోచనలనీ మించిన విశ్వాసముండేది, నాకు దొరకనిదేదో సొల్యూషన్ వుందనీ, యీ లోకమూ జీవితమూ అర్థం విహీనం కావనీ, యీ అయోమయ స్థితిలోనే సగంపైగా నా జీవితం గడిచింది. అట్లాంటి సమయంలో దీక్షితులుగారు వొచ్చి నన్ను తనతో షికారుగా రమణాశ్రమానికి తీసుకొచ్చారు 1936లో.

II


తోవలో భగవాన్ కోసం పళ్ళు కొనమంటే కొననన్నాను. ఆయనకి సాష్టాంగ పడమంటే పడనన్నాను. భగవాన్ ముందు నిశ్చబ్దంగా కూచున్న ప్రజలలో కూచోడం నాకు బాధగా వుంది. వొచ్చినప్పటినించి ఎప్పుడు పోదామా అని దీక్షితులు గారిని వేధిస్తున్నాను. ఆశ్రమంలో మనుష్యుల్ని చూసిన కోద్దీ అసహ్యం పుడుతోంది. 'యీ మహర్షి ఏదో దివ్య పురుషుడంటారు మీరు. మనుషుల్నే మారుస్తాడన్నారు. ఇన్నేళ్ళమట్టి ఆయనని అంటిపెట్టుకొని వున్న వీళ్ళ మొహాలిట్లా వున్నాయేమిటి ?'

ఆ రోజు భగవాన్ కొండమీదికి వెళ్ళి తిరిగి హాలులోకి. మా గుంపు వెనకనించి భగవాన్ వొస్తున్నారు. అందరూ పక్కకి తప్పుకొంటున్నారు. నేనే కదలలేదు, 'చోటు వుంది, పక్కకి తప్పుకుపోతారులే ఆయన ' అనుకుని. భగవాన్ సమీపించేటప్పటికి దీక్షితులుగారు నన్ను పక్కకి లాగేశారు. భగవాన్ నన్ను దాటి వెళ్ళి చప్పున ఆగి, వెనక్కి తిరిగి నన్ను ఓ గొప్ప చిరునవ్వుతో ఓ నిమిషం చూసి వెళ్ళిపోయినారు. ఆ నిమిషాన నాకేమనిపించలేదు గాని, ఇప్పుడు తలుచుకుంటే, ఆ నిమిషం నించే నన్ను జయించేసుకున్నారు భగవాన్ అనిపిస్తుంది.

III

పాత భక్తులూ, ఘరానా వాళ్ళూ భగవాన్ కి దగ్గిరగా కూచునేవారు. నేను చిట్ట చివర కూచుని ఆయన కళ్లలోకే చూస్తో వుండేవాడిని. ఒకసారి భగవాన్ తన దగ్గిర వున్నవాళ్ళని అడిగారు, అందరూ లేచిపోయినా కదలక కూచున్న నన్ను చూపి,

'ఎందుకు అన్ని గంటలూ అట్లా కూచుంటాడు ' అని.
వాళ్ళేదో అన్నారు. అది నా కర్థం కాలేదు. నాకేం కావాలి? ఆధ్యాత్మికోన్నతి. ఆ సంగతి భగవాన్ కి తెలీదా ? అనుకుని మాట్లాడకుండా వూరుకున్నాను. హాల్లోకి భగవాన్ వొస్తున్నపుడు సౌరీస్ దగ్గిర ఆగి చిరునవ్వుతో కొంతసేపు చీసి వెళ్ళేవారు. నేను బలవంతంగా హాల్లో కూచునేవాణ్ణి.
మళ్ళీ ఇంకోసారి అడిగారు దగ్గిరున్న వాళ్ళని,

'ఏం కావాలి? ఎందుకట్లా కూచుంటాడు ?' అని.
అప్పుడూ నేను మాట్లాడలేదు. 'ఏం భగవాన్ కి తెలీదా? '.

ఇప్పుడు తెలుస్తోంది భగవాన్ ప్రశ్నకి అర్థం.
'నన్ను చూస్తో కూచుంటే ఏమొస్తుంది? తనకి తాను సాధించుకోవాలి కాని '

IV

వొయ్యి చచ్చిపోయిన తొందరలోనే అరుణాచలం వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. ఆనాడు మాకు మిత్రులు లేరు , ఆదాయం లేదు, ఒక్క భగవాన్ తప్ప ఎవరూ కనిపించలేదు. భగవాన్ కి కూడా చాలా జబ్బుగా వుంది . బతకరంటున్నారు. 1950 మొదట్లో వొచ్చి, ఓ ఇల్లూ పాకా అద్దెకి తీసుకుని వున్నాం. భగవాన్ అంత జబ్బులోనూ , ఎంతో ఆదరంగా చూశారు మా వంక, మా రాకకే ఎదురుచూస్తున్నట్లు. త్వరలోనే భగవాన్ అస్తమించారు. మేం ఆయన ముందు చావాలని వొస్తే, ఆయనే మా ముందు వెళ్ళిపోయారు. భక్తులందరూ వెళ్ళిపోయారు. ఆశ్రమం , మేమూ మాత్రమే మిగిలాం. భయం పుట్టించే వొంటరితనంలోనూ భగవాన్ మమ్మల్నిఆదుకుని, అర్థంగాని ధైర్యమిచ్చి రక్షించారు. భగవాన్ వెళ్ళేముందు తాను ఇక్కడే వుంటానన్నాడు.నా ఆరోగ్యమూ సన్నగిల్లుతోంది. చివరి దశను సమీపిస్తున్నాను.

ఇప్పటికీ నాకు దేవుడిలోగాని, కర్మలోగాని, చావు తరవాత బతుకులోగాని విశ్వాసం లేదు. ఏదన్నా చేస్తే భగవాన్ ఒక్కరే చెయ్యగలరని విశ్వాసం మాత్రం వుంది.


[కుదిరితే యింకెప్పుడైనా వివరంగా ' రమణాశ్రమంలో భగవాన్ తో చలం ' ]

భగవాన్ స్మృతులు | తోవ తప్పిన భక్తుడు

Wednesday, May 27, 2009
ఒక పాశ్చత్య భక్తుడు అరుణాచల పర్వతాన్ని అడ్డదారిని ఎక్కి వెళ్ళాడు. వెంట ఎవరినీ తీసుకువెళ్ళలేదు. ప్రొద్దుటనగా వెళ్ళిన వాడు చీకటి పడినా రాలేదు. అతనికోసం ఆశ్రమంలోని వారంతా ఆరాటపడుతున్నారు. భగవాన్ కూడా దూరదర్శిని ( బైనాక్యులర్స్ ) తో కొండకేసి చూస్తున్నారు. అతగాడి జాడలేదు. రాత్రి పొద్దుపోయినతరువాత అలసి సొలసి వచ్చాడు.

వచ్చి, ఒకచోట అలసటతో చతికిలబడ్డాడు. అక్కడికి కొంతమంది భక్తులు చేరారు. భగవాన్ కూడా వెళ్ళారు. 'ఇంత ఆలస్యంగా వచ్చారేమి? ' అని అడిగారు భగవాన్. ఆయన గుడ్లు మిటకరించి చూస్తూ

'భగవాన్, అదేమిటీ, మీరేకదా నేను తోవ తప్పి ఆదుర్దాపడుతుంటే కనపడి
ఆ అగాధాలను దాటించి తీసుకువచ్చారు? ' అన్నాడు.

భగవాన్ స్మృతులు | ఆత్మహత్య

సుందరేశయ్యర్ భగవాన్ భక్తుడు. అతనికి కష్టాల మీద కష్టాలు వచ్చిపడ్డాయి. భరించలేకపోయాడు. ఆత్మహత్యకు సిద్దపడ్డాడు. సిద్దమై కడసారిగా భగవాన్ దర్శనానికివెళ్లాడు. భగవాన్ అప్పుడు విస్తళ్ళు కుడుతున్నారు.

సుందరేశయ్యర్ ఏమీ అడక్కుండానే

'చూశారా, ఒక విస్తరిని కుట్టాలంటే ఎంత శ్రమో! అడవికి వెళ్ళాలి. ఆకులు ఏరి తేవాలి. వాటిని ఎండబెట్టాలి. పుల్లలు తేవాలి. వాటిని సన్నగా చీల్చాలి. అప్పుడీ ఆకులు ఒకదానికొకటి అంటుకునేటట్టు గుండ్రంగా కుట్టాలి. ఇంత శ్రమపడి కుట్టిన ఆకుని అవతలపారేస్తామా? అదెందుచేత కుట్టబడిందో ఆ పని అయిన తరవాతగాని పారేయం. అనగా, దాంట్లో భోంచేసింతరువాతగాని పారేయం ' అన్నారు భగవాన్.

Somerset Maugham తో భగవాన్

Monday, May 25, 2009
ఆంగ్ల రచయితలలో సోమర్సె ట్ మాం ( Somerset Maugham ) అగ్రశ్రేణికి చెందినవాడు. యీయన రాసిన కథలు ప్రపంచంలోని అనేక భాషలలోనికి అనువదించబడ్డాయి. 1936 లో భారతదేశం వచ్చాడు. భగవాన్ శ్రీ రమణ మహర్షులవారిని దర్శించాలని తిరువన్నామలై వచ్చాడు. ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడో లేదో, అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు లోనై స్పృహతప్పి పడిపోయాడు. ఆశ్రమవాసులు ఒక కుటీరంలోనికి తీసుకువెళ్లి పడుకోబెట్టారు.

భగవాన్ కు యీ కబురందగానే వచ్చారక్కడికి. ఆయనకేసి సుమారు పావుగంట సేపు చూస్తూ కూర్చున్నారు. ఆయన కళ్లు తెరచి భగవాన్ ను చూశారు. కాని, మాట్లాడలేకపోయారు. 'మౌనమే ఎడతెగని భాష ' అన్నారు భగవాన్. ఆయన మనసులోని ఆవేదనను కనిపెట్టి, ఆ తరువాత మరికొన్నినిముషాలు కూర్చుని వెళ్లిపోయారు. మరునాటికి సోమర్సెట్ మాం భగవాన్ ఆసీనులై ఉన్న హాల్ లోనికి రాగలిగారు. చాలాసేపు కూర్చుని నమస్కరించి వెళ్లిపోయారు.

'నేను అనేకమంది మహాత్ములను గురించి విన్నాను. కొంతమందిని దర్శించాను.అయితే,
శ్రీ రమణుల సన్నిధిలో అనుభవించిన మధురానుభూతిని,ఆనంద సాగర తరంగాల మీద
తేలిపోతున్న అనుభూతిని ఎప్పుడూ పొందలేదు '
అని రాశారు తన రచన 'మహర్షి ' ( The Saint ) అనే పుస్తకంలో.

సిద్దపురుషులు

ఒకనాడొక కుక్క కొండమీదనుంచి ఆశ్రమంలోనికి వచ్చి మొరగడం ప్రారంభించింది.
అదెంత మొరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
చివరికి భగవాన్ వచ్చి ఆ కుక్కకు అన్నం పెట్టించారు.
తిని వెళ్ళిపోయిందది.
తరవాత అన్నారు భగవాన్ 'వారొక సిద్దపురుషులు.
ఆశ్రమభిక్ష స్వీకరించాలని ఆ రూపంలో వచ్చారు ' అని.

చిరుతపులితో భగవాన్

Sunday, May 24, 2009
భగవాన్ పచ్చయ్యమ్మ కోయిలలో వుంటూ వుండే రోజుల్లో, ఓ రోజు మద్రాసునుంచి వారి భక్తులు రంగస్వామి అయ్యంగారు వొచ్చారు. మధ్యాన్నం వొంటిగంటకి మండుటెండలో, ఆలయం ఎదురుగా వుండే కొలనులో స్నానానికి వెళ్ళారు. అదంతా అడవి. ఎవరూ లేరు. హాయిగా స్నానం చేస్తున్నారు అయ్యంగారు.

భక్తులతో మాత్లాడుతో వున్న భగవాన్ చప్పున లేచారు.
అక్కడికొక చిరుత పులి వొస్తోంది, దాహం తీర్చుకోవడానికి.
అయ్యంగారు ఇవతల వొడ్డున స్నానం చేస్తున్నారు. చిరుతని చూడలేదు.

'ఇపుడు పోయి కొంచెం ఆగి తరువాత రా,
నిన్ను చూసి అయ్యంగారు భయపదతారు ' అన్నారు భగవాన్.
చిరుతపులి వెళ్ళిపోయింది.

భగవాన్ని చూసిన ఫలితం

పెరూ దేశం నుంచి వొక భార్యా భర్తా వొచ్చారు ఆశ్రమానికి . వాళ్ళు భగవాన్ని దర్శించి తమ కథనంతా చెప్పుకున్నారు. భగవాన్ విషయం చదివినప్పటి నుంచి జీసస్ తిరిగి భూమి మీద అవరతించినట్టుగా భావించి, ఆయనని దర్శించుకోవాలని ఆశించారు. కాని డబ్బులేదు. ప్రతి వారమూ తమ జీతంలో కొంత దాచి కొన్నేళ్ళకి స్టీమర్లో చాలా బీద ప్రయాణీకుల కింద బయలుదేరారు. కొన్ని నెలలు ప్రయాణంలో అవస్థలు పడ్డారు.
వారి చరిత్రనంతా భగవాన్ జాగ్రత్తగా విని -

'ఇన్ని కష్టాలుపడి ఇంత దూరం ఎందుకు వొచ్చారు?
అక్కడనించి నన్ను తలుచుకుంటే సరిపోదా?
ఇక్కడికి వొచ్చి నన్ను చూసినంత ఫలితమూ, తృప్తీ అక్కడే కలిగేది కద మీకు?' అన్నారు.

జన్మలు

Thursday, May 21, 2009
'ఒకసారి మానవజన్మ ఎత్తిన తరువాత మళ్ళీ నీచజన్మలు ఎత్తడానికి తావుందా?'
అన్న ప్రశ్న బయలుదేరింది ఆశ్రమంలో ఒకనాడు. ఇదమిద్దమని తేలలేదు. భగవాన్ ని అడిగారు.

'చాలా పుణ్యం చేసుకున్న మానవుడు కూడా ఏదో జంతు జన్మ నెత్తవచ్చు.
ఎందుకంటే జంతువు యొక్క ఆయుషు తక్కువనీ, ప్రారబ్దశేషాన్ని
త్వరగా
అనుభవించివెయ్యొచ్చనీ, అటువంటి జన్మని కావాలని కోరుకునే
ఉత్తమ మానవులున్నారు ' అని బదులిచ్చారు భగవాన్.

భగవాన్ చేతి వంట

Wednesday, May 20, 2009
భగవాన్ కి తమ పనులు తాము చేసుకోవడమేగాక ఆశ్రమం పనులు కూడా చూడ్డం అలవాటు. అరుగులు అలుకుతారు. నేల తుడుస్తారు. విస్తళ్ళు కుడతారు. కూరలు తరుగుతారు. పచ్చళ్ళు రుబ్బుతారు. వంట చేస్తారు. వంట భగవాన్ దగ్గరే నేర్చుకోవాలి. నలుడూ, భీముడూ చేసినంత బాగా చేస్తారన్నంత ప్రతీతి. దేన్నీ వృధా పోనియ్యరు. తొక్కలనీ, తొడిమెలనీ కూడా పారెయ్యనియ్యరు. వాటితో పచ్చడి చేస్తారు. పులుసులో పడేస్తారు. వారి చెయ్యి పడితే చాలు అది అమృత ప్రాయంగా తయారవుతుంది.

ఎంతసేపటికీ పప్పు ఉడకడం లేదని శాంతమ్మ చిరాకుపడి, అక్కడే వున్న భగవాన్ తో చెప్పిందా విషయం.

'దాని మొహాన చారెడు ఉప్పు కొట్టు. ' అన్నారు భగవాన్.
ఉప్పు వేస్తే పప్పు ఉడకదని తెలుసు శాంతమ్మకి. అయినా, భక్తితో భగవాన్ చెప్పినట్టే చేసింది.
పర్యవసానం ? పప్పు చక్కగా వుడికి వూరుకుంది.

మౌనం

ఒకరోజు పాశ్చాత్యవ్యక్తి ఒకరు భగవాన్ దర్శనార్థం అమెరికా నుంచి వచ్చాడు. వచ్చి, భగవాన్ సన్నిధిలో మూడు గంటలు కూర్చుని వెళ్కిపోయాడు. భగవాన్ ని పలకరించనయినా లేదు. అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు. ఒక భక్తుడడిగాడు.

'అంతదూరం నుంచి ప్రత్యేకంగా వొచ్చి అంతసేపూ కిక్కురు మనకుండ కూర్చుని వెళ్ళీపోయాడే ' మని .

'వారొక పనిమీద వచ్చారు. వచ్చిన పని పూర్తయింది.
ఇక్కడే వుండిపోవాలనేదేముంది
' అన్నారు భగవాన్.

పాపి

Tuesday, May 19, 2009
ఒకసారి ఒకాయన
'ఇన్నేళ్ళబట్టి వస్తున్నాను మీ దగ్గరికి. నాలో ఏ మార్పూ కనపడదు. నేను ఇంకా పాపిగానే వున్నాను '

అని దుఃఖపడ్డాడు. 'ఈ దారిలో మైలు రాళ్ళు లేవు. నువ్వెంత దూరం పోతోందీ నీ కెట్లా తెలుస్తుంది ?
మీరంతా మొదటి తరగతి ప్రయాణీకులు. మొదటి తరగతి ప్రయాణీకుడు ఏం చేస్తాడు?
గార్డుతో చెబుతాడు తాను ఎక్కడ దిగాలో. చెప్పి తలుపులు బిగించుకుని నిద్రపోతాడు.
వాడు చెయ్యవలసింది అంతే.
స్టేషన్ రాగానే గార్డే వచ్చి లేపుతాడు ' అన్నారు.

పాపపుణ్యాలు

ఒకసారి ఒకాయన తాను పాపిని అని ఏడ్చాడు భగవాన్ ముందు.
'నిద్రలో ఏముండింది ? పుణ్యం వుందా, పాపం వుందా ? నిద్రలో నువ్వు పుణ్యుడివా?పాపివా? ఎవరు నువ్వు? '
'నాకు తెలీదు, '
'ఇప్పుడుమాత్రం ఏం తెలుసు నీకు, నువ్వెవడివో చెప్పేందుకు?
నువ్వు చేసింది పుణ్యమో, పాపమో, ! పుణ్యం అనుకుంటే అది పుణ్యం,
పాపం అనుకుంటే అది పాపమూనా ? పుణ్యమూ పోతుంది, పాపమూ పోతుంది.
మిగిలివుండేది నువ్వే ' .

పాపులు

ఆశ్రమం పక్కనే వున్న దక్షిణామూర్తి మంటపంలో ఒకాయన భంగు తాగి కేకలు వేస్తుండేవాడు. జయంతికి ఆయన్ని ఎవరూ గమనించలేదు. ఆయన గబ గబా భగవాన్ ముందుకు వొచ్చి, అధికారంగా డిమాండ్ చేస్తో -

'నీ గేటు దగ్గిర దర్వాన్ కి నువ్వు భోజనం పెట్టుకోకపోతే ఎవరు పెడతారనుకున్నావు ? ' అని గర్జించాడు.
దానికి భగవాన్ మహా వినయ స్వరంతో -
'అట్లాగా! ఎవరూ నిన్ను చూడనే లేదా? పొరపాటే. ఒరే మాధవా! మన దర్వానికి మనం భోజనం పెట్టకపోతే, ఎవరు పెడతారు? పొరపాటయింది, ఈసారికి వూరుకోండి.
మాధవా! ఈయన్ని తీసుకునివెళ్ళి భోజనం పెట్టించు ' అన్నారు.

పాపులమనుకునేవారు అనేకమంది వొచ్చేవారు భగవాన్ ముందుకి.
ఆయన్ని చూడగానే అనేక విధాలైన వికారాలు కలిగేవి.

భగవాన్ నిర్యాణం

భగవాన్ కొద్దిరోజుల్లో నిర్యాణం చెందుతారనగా ఒక ఉదయం పార్సీ అతను Framjie మతం ప్రార్థన
'ఉదయించే సూర్యుడికి నేను సాష్టాంగ పడుతున్నాను '
అనేది భగవాన్ ఎడల చదివాడు.

దానికి భగవాన్
'సూర్యుడు అస్తమిస్తున్నాడు , అదెట్లా సందర్భమవుతుంది? ' అన్నారు.

Blessing

Blessing
Bhagavan Memories